అశ్విన్, షమీలపైనే దృష్టి
♦ నేడు న్యూజిలాండ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్
♦ యువరాజ్‌కు అస్వస్థత, ప్రాక్టీస్‌కు దూరం
లండన్: ఆరు వారాలపాటు ఐపీఎల్‌లో ధనాధన్ క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లు ఇక వన్డే ఫార్మాట్‌పై దృష్టి పెట్టారు. చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. దీంట్లో భాగంగా నేడు (ఆదివారం) తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఇంగ్లండ్‌లోని గడ్డు పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు టోర్నీకి ముందు తమ బలాలు, బలహీనతలను సరిచూసుకునేందుకు కోహ్లి బృందానికి ఈ రెండు మ్యాచ్‌లు చక్కటి అవకాశం. ఈ ఏడాది జనవరిలో భారత జట్టు చివరిసారిగా ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్ ఆడింది.
ఇక నేటి వార్మప్‌లో జట్టులోని 15 మంది ఆటగాళ్లకు ప్రాక్టీస్ లభించేలా వెసులుబాటు ఉంది. ఎందుకంటే తుది జట్టులో ఉండే ఆటగాళ్లతో పాటు మిగిలిన వారికి కూడా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టోర్నీలో తమ ప్రారంభ మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండటంతో అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాలని జట్టు భావిస్తోంది. అయితే యువరాజ్ అస్వస్థత కారణంగా శనివారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. దీంతో అతను బరిలోకి దిగేది అనుమానంగానే ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే పరిస్థితి ఉండటంతో 300పై చిలుకు స్కోరు వచ్చేలా కనిపిస్తోంది.
కోహ్లి, ధోనికి కూడా కీలకమే...
నిరంతరాయంగా భారత గడ్డపై 13 టెస్టుల్లో పాల్గొన్న ఆఫ్ స్పిన్నర్ ఆర్.అశ్విన్‌కు ముందు జాగ్రత్తగా బీసీసీఐ దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతిని కల్పించింది. దీంతో అతను ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి తన లయను అందుకునేందుకు ఈ రెండు మ్యాచ్‌లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే తుది జట్టులో ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌తోనే ముందుకు వెళదామని టీమ్ మేనేజిమెంట్ భావిస్తే రవీంద్ర జడేజాతో అశ్విన్ పోటీపడాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యర్థి జట్టులోని కేన్ విలియమ్సన్, గప్టిల్, లాథమ్‌లాంటి బ్యాట్స్‌మెన్‌పై తన నైపుణ్యాన్ని పరీక్షించుకునేందుకు అశ్విన్‌కు ఇది చక్కటి అవకాశం. ఇక పేసర్ మొహమ్మద్ షమీ వన్డే మ్యాచ్‌లు ఆడక రెండేళ్లవుతోంది. 2015 ప్రపంచకప్ సెమీస్ అనంతరం గాయం కారణంగా అతను దూరమవ్వాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఫిట్‌నెస్‌తో ఉన్న షమీ బంతిని ఎలా స్వింగ్ చేయగలడన్నది కీలకం. అతడితో పాటు భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తుది జట్టులో ఉండేందుకు ఎదురుచూస్తున్నారు. ఇక బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, ధావన్ ఓపెనర్లుగా దిగాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో ఫామ్ చాటుకోవడంతో పాటు 2013 టోర్నీలో కీలకంగా నిలిచిన ధావన్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో జట్టు నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. అన్నింటికీ మించి కెప్టెన్ కోహ్లి, ధోని బ్యాటింగ్ తిరిగి గాడిలో పడాలంటే వార్మప్ మ్యాచ్‌లను సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఓవరాల్‌గా మెక్లీనగన్, సౌతీ, బౌల్ట్ త్రయం పేస్ దాడిని భారత బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కొని తమ ఫామ్ చాటుకోవాలని చూస్తున్నారు.
స్టార్ స్పోర్ట్స్–1లోమధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం