వార్మప్‌లో వారెవ్వా | Virat Kohli, Shami shine as India beat New Zealand | Sakshi
Sakshi News home page

వార్మప్‌లో వారెవ్వా

Published Mon, May 29 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

వార్మప్‌లో వారెవ్వా

వార్మప్‌లో వారెవ్వా

► చెలరేగిన షమీ, భువనేశ్వర్‌
► కోహ్లి  అజేయ అర్ధ సెంచరీ
► డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం
►  న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌


చాంపియన్స్‌ ట్రోఫీలో తమ సన్నాహాలను టీమిండియా... ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా ఆరంభించింది. ఇప్పటిదాకా జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ ప్రతీ జట్టు ఇక్కడి ఫ్లాట్‌ పిచ్‌లపై అలవోకగా 300కు పైగా పరుగులు సాధించింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య అధికారికంగా జరిగిన రెండు వన్డేల్లోనూ ఇదే పరిస్థితి.

ఇలాంటి తరుణంలో భారత బౌలర్లు తమ సత్తా ఏమిటో చాటి చెప్పారు. వైవిధ్యమైన బంతులతో మాజీ చాంపియన్‌ న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించారు. రెండేళ్ల అనంతరం బరిలోకి దిగినా తన బౌలింగ్‌లో పదునేమీ తగ్గలేదని పేసర్‌ షమీ నిరూపిస్తూ ఆరంభంలోనే కివీస్‌ వెన్నువిరిచాడు. ఆ తర్వాత జడేజా, భువనేశ్వర్‌ మిగతా ఆటగాళ్ల భరతం పట్టడంతో కివీస్‌ కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది.  ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం అడ్డుగా నిలిచినా మెరుగైన రన్‌రేట్‌ కారణంగా విజయం భారత్‌నే వరించింది.

లండన్‌: తొలి వార్మప్‌ మ్యాచ్‌లోనే భారత జట్టు మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింట్లోనూ విశేషంగా రాణించింది. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ 45 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. రోంచి (63 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్‌ (47 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకున్నారు.భువనేశ్వర్, మొహమ్మద్‌ షమీ మూడేసి వికెట్లు తీయగా... జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అప్పటికి డకవర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది. టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్‌ నెగ్గినట్టు ప్రకటించారు. చూడచక్కని షాట్లతో అలరించిన విరాట్‌ కోహ్లి (55 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, శిఖర్‌ ధావన్‌ (59 బంతుల్లో 40; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మంగళవారం జరిగే రెండో వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ ఆడుతుంది.

రోంచి రాణించినా..
కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రోంచి, జేమ్స్‌ నీషమ్‌ బ్యాటింగ్‌ మినహా మరే మెరుపులూ లేవు. మూడో ఓవర్‌ నుంచే వీరి వికెట్ల పతనం కొనసాగింది. పేసర్‌ షమీ కీలక బ్యాట్స్‌మన్‌ గప్టిల్‌ (9)ను అవుట్‌ చేసి దెబ్బ తీశాడు. ఆ తర్వాత షమీ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రోంచి వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు. అయితే కెప్టెన్‌ విలియమ్సన్‌ (8), బ్రూమ్‌లను షమీ పెవిలియన్‌కు పంపాడు.

అటు ధాటిగా ఆడిన రోంచి 42 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... అతడి జోరుకు తొలి 10 ఓవర్లలో జట్టు 70 పరుగులు సాధించింది. ఈ దశలో అతడికి ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి పెద్దగా సహకారం అందలేదు. భారత బౌలర్ల ధాటికి ఆ తర్వాతి కివీస్‌ 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15వ ఓవర్‌లో అండర్సన్‌ (13)ను భువనేశ్వర్‌ బౌల్డ్‌ చేయగా... 21వ ఓవర్‌లో జడేజా అద్భుత బంతికి రోంచి కూడా బౌల్డ్‌ అయ్యాడు.  దీంతో కివీస్‌ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. మధ్య ఓవర్లలో నీషమ్‌ అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ జట్టుకు అండగా నిలవాలని చూసినా వరుసగా వికెట్లు పతనం కావడంతో జట్టు పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది.

కోహ్లి, ధావన్‌ భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కోహ్లి, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కీలకంగా నిలిచారు. రెండో ఓవర్‌లోనే క్యాచ్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి ధావన్‌ తప్పించుకోగా ఐదో ఓవర్లో రహానే (7) రూపంలో జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. హుక్‌ షాట్‌కు ప్రయత్నించిన రహానే  స్క్వేర్‌ లాంగ్‌ లెగ్‌లో బౌల్ట్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత కోహ్లి, ధావన్‌ జోడి నిలకడగా ఆడుతూ అండగా నిలిచింది. వీరిద్దరి ఆటలో దూకుడు లేకపోయినా అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచారు.

అయితే అర్ధసెంచరీ వైపు పయనిస్తున్న ధావన్‌ను 19వ ఓవర్‌లో నీషమ్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవర్‌ వ్యవధిలోనే దినేశ్‌ కార్తీక్‌ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. అటు సరిగ్గా 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లికి ధోని (21 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తోడవ్వడంతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో ధోని ఇచ్చిన క్యాచ్‌ను గ్రాండ్‌హోమ్‌ వదిలేయడంతో అది సిక్స్‌ వెళ్లగా అదే బౌలింగ్‌లో ఫోర్‌ కూడా బాది జోరును కనబరిచాడు. కానీ 26 ఓవర్ల అనంతరం కురిసిన వర్షం ఎంతకూ తెరిపినీయకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) భువనేశ్వర్‌ (బి) షమీ 9; రోంచి (బి) జడేజా 66; విలియమ్సన్‌ (సి) రహానే (బి) షమీ 8; బ్రూమ్‌ (సి) ధోని (బి) షమీ 0; అండర్సన్‌ (బి) భువనేశ్వర్‌ 13; సాన్‌ట్నర్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 12; గ్రాండ్‌హోమ్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 4; నీషమ్‌ నాటౌట్‌ 46; మిల్నే (సి) ధోని (బి) ఉమేశ్‌ 9; సౌతీ (బి) భువనేశ్వర్‌ 4; బౌల్ట్‌ (సి) షమీ (బి) భువనేశ్వర్‌ 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (38.4 ఓవర్లలో ఆలౌట్‌) 189.
వికెట్ల పతనం: 1–20, 2–63, 3–63, 4–86, 5–110, 6–116, 7–126, 8–156, 9–166, 10–189. బౌలింగ్‌: షమీ 8–0–47–3; హార్దిక్‌ పాండ్యా 6–0–49–0; బుమ్రా 4–0–14–0; భువనేశ్వర్‌ 6.4–1–28–3; జడేజా 4–0–8–2; అశ్విన్‌ 6–0–32–1; ఉమేశ్‌ 4–0–11–1.
భారత్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) బౌల్ట్‌ (బి) సౌతీ 7; ధావన్‌ (సి) అండర్సన్‌ (బి) నీషమ్‌ 40; కోహ్లి నాటౌట్‌ 52; దినేశ్‌ కార్తీక్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) బౌల్ట్‌ 0; ధోని నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (26 ఓవర్లలో మూడు వికెట్లకు) 129.
వికెట్ల పతనం: 1–30, 2–98, 3–104. బౌలింగ్‌: సౌతీ 7–0–37–1; బౌల్ట్‌ 7–1–34–1; మిల్నే 4–0–20–0; నీషమ్‌ 3–0–11–1; గ్రాండ్‌హోమ్‌ 5–0–22–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement