ఆటతీరు... ఇటీవల ఆడిన తీరును గమనించారు. నిలకడైన ప్రదర్శనకు ఓటేశారు.అనుభవం... ఆటతో పాటే అనుభవానికి విలువిచ్చారు. జట్టు సమతౌల్యానికి పెద్దపీట వేశారు.వాతావరణం... ఇంగ్లండ్ వాతావరణంపై అంచనా వేశారు. అక్కడి పరిస్థితులకు తగ్గట్లే జట్టు కూర్పు చేశారు. స్థూలంగా భారత వన్డే జట్టు ఎంపికపై సీనియర్ సెలక్షన్ కమిటీ భారీ కసరత్తే చేసింది. ప్రపంచకప్ వేటకు ఆటగాళ్లను సిద్ధం చేసింది.
ముంబై: శిఖర్ ధావన్ ఆడట్లేదు... ప్రపంచకప్‌కు డౌటే! రిషభ్ పంత్ పవర్ హిట్టర్. తప్పకుండా చాన్స్ ఇస్తారు... విజయ్ శంకర్ బంగ్లాదేశ్‌లాంటి చిన్నజట్టుతోనే ఒత్తిడికి చిత్తయ్యాడు. ఇక ఇంగ్లండ్‌కు అతడినేం ఎంపిక చేస్తారు... ఇలా క్రికెట్ మతమైన భారత్‌లో అందరి చర్చ వరల్డ్‌కప్ ఆడే టీమిండియా సెలక్షన్‌పైనే! ఈ చర్చలకు ఫుల్‌స్టాప్ పడింది. మెగా ఈవెంట్‌కు కోహ్లి సేన ఎంపికైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి సీనియర్ సెలక్షన్ కమిటీ సోమ వారం ఇంగ్లండ్ విమానమెక్కే 15 మంది సభ్యుల టీమిండియాను ప్రకటించింది. తెలుగుతేజం అంబటి రాయుడు తనకు స్థానం గ్యారంటీ అనుకుని భంగపడ్డాడు. గతేడాది పర్లేదనిపించినా... ఈ ఏడాది ఆరంభం నుంచీ తడబడుతుండటంతో హైదరాబాదీకి అవకాశం దక్కలేదు. యువ వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను కాదని అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌కే రెండో వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చారు. అనూహ్యంగా విజయ్ శంకర్ ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే చాన్స్ కొట్టేశాడు. పేసర్ షమీకి అవకాశమిచ్చినా... ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. గత కొంతకాలంగా అతను పరిమిత ఓవర్ల క్రికెట్లో రాటుదేలాడు.
వచ్చాడు సరే... మరి ఆడే చాన్స్?
భారత క్రికెట్‌లో ధోని కంటే దినేశ్ కార్తీకే సీనియర్ వికెట్ కీపర్! కానీ ధోని ఎక్కడికో ఎదిగిపోతే... కార్తీక్‌కు స్థిరమైన చోటేలేదు. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మళ్లీ 33 ఏళ్ల వయసులో కార్తీక్ ప్రపంచకప్‌కు పయనమవుతున్నాడు. 2007 ప్రపంచకప్ ఆడి న దినేశ్... 21 ఏళ్ల రిషభ్ పంత్‌ను తోసిరాజని అనుభవంతో జట్టులో స్థానం అందుకున్నాడు. అయితే తుది జట్టుకు ఆడేది మాత్రం ధోని అందుబాటులో లేకపోతేనే! ఎందుకంటే అతను రెండో కీపర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌కు ముందే కోహ్లి లీగ్ ప్రదర్శన పట్టించుకోమన్నాడు. అన్నట్లుగానే ఈ సీజన్‌లో 245 పరుగులు చేసిన పంత్ కంటే 111 పరుగులు చేసిన కార్తీకే సెలెక్ట్ అయ్యాడు.
వరల్డ్‌కప్‌కు 7 కొత్త ముఖాలు...
ధోని (జార్ఖండ్) వరుసగా నాలుగో మెగా సమరానికి సిద్ధమవుతుండగా... కోహ్లి (ఢిల్లీ)కిది మూడోది. మిగిలిన వారిలో రోహిత్ శర్మ (ముంబై), శిఖర్ ధావన్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), షమీ (బెంగాల్), భువనేశ్వర్ (ఉత్తరప్రదేశ్) 2015 ప్రపంచకప్ ఆడారు. ఇప్పుడు ఈ టోర్నీకి ఎంపికయ్యారు. మిగతా 8 మందిలో 2007 ప్రపంచకప్ ఆడిన దినేశ్ కార్తీక్ (తమిళనాడు)ను మినహాయిస్తే విజయ్ శంకర్ (తమిళనాడు), లోకేశ్ రాహుల్ (కర్ణాటక), కేదార్ జాదవ్ (మహారాష్ట్ర), హార్దిక్ పాండ్యా (బరోడా), కుల్దీప్ యాదవ్ (ఉత్తరప్రదేశ్), యజువేంద్ర చహల్ (హరియాణా), జస్‌ప్రీత్ బుమ్రా (గుజరాత్)... ఈ ఏడుగురు క్రికెటర్లకు ఇదే తొలి ప్రపంచకప్.
విజయ్ శంకర్‌కు లక్కీ చాన్స్...
ఈ సెలక్షన్స్‌లో జాక్‌పాట్ కొట్టిన ఒకే ఒక్కడు విజయ్ శంకర్. నిజానికి అతను ప్రపంచకప్ ప్రణాళికల్లో లేడు. ఇప్పుడేమో ఏకంగా తుది జట్టుకు ఆడే లక్కీచాన్స్‌ను కొట్టేశాడు. అదేంటి అపుడే తుదిజట్టని ఆశ్చర్యపోకండి... ఎందుకంటే స్వయంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాదే స్వయంగా అతన్ని నాలుగో నంబర్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించామన్నారు. మూడు రకాల ఉపయోగాలున్నాయన్నారు. పేసర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, మిడిలార్డర్‌లో కేదార్, రాహుల్‌కు సరైన ప్రత్యామ్నాయంగా జట్టు అవసరాలను తీరుస్తాడని ప్రసాద్ చెప్పారు. ప్రస్తుత 15 మంది సభ్యులుగల జట్టులో ఎవరైనా గాయపడితే మే 23లోపు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత జట్టు వెంట రిజర్వ్ బౌలర్లుగా ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ వెళ్తారని... నెట్ ప్రాక్టీస్ కోసం మరో ఐదుగురు బౌలర్లను కూడా ఇంగ్లండ్‌కు పంపిస్తామని బీసీసీఐ తెలిపింది.
షమీపై నమ్మకముంచారు...
చాన్నాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమై చివరకు టెస్టు పేసర్‌గా స్థిరపడిన షమీ... గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెప్పుకోదగ్గ పరిణతి సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లోనూ షమీ అదరగొడుతున్నాడు. దీంతో ఇంగ్లండ్ పిచ్‌లకు స్వింగ్, యార్కర్ల హీరోలు భువీ, బుమ్రాలకు తోడుగా అనుభవజ్ఞుడైన, ఫామ్‌లో ఉన్న షమీ అవసరాన్నీ సెలక్టర్లు గుర్తించారు. హార్దిక్ పాండ్యా హిట్టరే కాదు... పేసర్‌గాను జట్టుకు ఉపయోగపడతాడు. దీంతో ప్రపంచకప్ రేసులో ఉన్న అతని స్థానానికి ఎవరూ ఎసరు తేలేదు.
వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్) బ్యాట్స్‌మన్
రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్) బ్యాట్స్‌మన్
శిఖర్ ధావన్ బ్యాట్స్‌మన్
లోకేశ్ రాహుల్ బ్యాట్స్‌మన్
ఎం.ఎస్. ధోని వికెట్ కీపర్
దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్
విజయ్ శంకర్ ఆల్‌రౌండర్
కేదార్ జాదవ్ ఆల్‌రౌండర్
హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్
రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్
కుల్దీప్ యాదవ్ స్పిన్నర్
యజువేంద్ర చహల్ స్పిన్నర్
మొహమ్మద్ షమీ పేస్ బౌలర్
జస్‌ప్రీత్ బుమ్రా పేస్ బౌలర్
భువనేశ్వర్ కుమార్ పేస్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment