
ప్రియ ప్రత్యర్థుల పోరు
స్టార్ స్పోర్ట్స్ 1లో
మ. గం. 1.30నుంచి ప్రత్యక్ష ప్రసారం
నేడు లంకతో భారత్ ఢీ
జోరు మీదున్న ఇరు జట్లు
ఆసియా కప్ వన్డే టోర్నీ
ప్రపంచ వన్డే చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగినన్ని మ్యాచ్‌లు (143) మరే జట్ల మధ్య జరగలేదు. ప్రత్యర్థి బలాలు, బలహీనతల గురించి వారు ఆలోచించడం, వ్యూహాలు రచించడం అంటే చర్వితచర్వణమే. అభిమానులు ఎదురు చూసే మ్యాచ్‌ల జాబితాలో ఇది లేకున్నా...ఆసియాలో బలమైన ఈ టీమ్‌ల మధ్య మ్యాచ్‌ను కీలక పోరుగా చెప్పవచ్చు. జోరు మీదున్న విరాట్ కోహ్లి, లంక పేస్ ఆయుధం లసిత్ మలింగల ప్రదర్శన మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
ఫతుల్లా: ఆసియా కప్ టోర్నీలో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి జోరు మీదున్న భారత్, మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం ఇక్కడ జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో కోహ్లి సేన, శ్రీలంకను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించగా...లంక జట్టు కొంత తడబాటుకు గురైనా పాక్‌ను ఓడించింది. ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లాలంటే లంక, పాక్‌లతో మ్యాచ్‌లు భారత్‌కు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో లంకపై విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
ఓపెనర్లు నిలబడతారా...
ఇటీవల భారత జట్టు సాధించిన విజయాలు, విరాట్ కోహ్లిని వేరు చేసి చూడలేం. అద్వితీయ ఫామ్‌తో అతను జట్టును గెలిపిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రహానే కూడా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఆహా, ఓహో...అనిపించిన ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అటు జంటగా గానీ, ఇటు వ్యక్తిగతంగా గానీ ఇద్దరూ రాణించలేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. ఆరంభంలోనే వికెట్ పడిపోవడం, కోహ్లి ఆదుకోవడం నిత్యకృత్యంగా మారింది. ఇద్దరు ఓపెనర్లకు సమయం మించిపోతున్నట్లుగా చెప్పవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే వీరిపై వేటు కూడా వేసే అవకాశం ఉంది. మరో వైపు గత మ్యాచ్‌లో రాయుడుకు పెద్దగా ఆడే అవకాశం రాలేదు కాబట్టి అతడినే కొనసాగిస్తే పుజారాకు మళ్లీ నిరాశ తప్పదు. బౌలింగ్‌లో మాత్రం భువనేశ్వర్, షమీ పర్వా లేదనిపించినా...వరుణ్ ఆరోన్ తీవ్రంగా నిరాశ పర్చాడు. అతడిని బంగ్లా బౌలర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు. వరుణ్ స్థానంలో తొలి సారి ఈశ్వర్ పాండేకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
2 మరో రెండు వికెట్లు తీస్తే అశ్విన్ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.
1 భారత్, శ్రీలంక మధ్య మొత్తం 143 వన్డేలు జరిగాయి. ఏ రెండు జట్ల మధ్య ఇన్ని మ్యాచ్‌లు జరగలేదు. వీటిలో భారత్ 78 గెలవగా, లంక 53 మ్యాచుల్లో నెగ్గింది. 1 మ్యాచ్ టై కాగా.. 11 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
పిచ్
ఫతుల్లా వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బ్యాట్స్‌మెన్‌పైనే భారం...
మరో వైపు శ్రీలంక తొలి మ్యాచ్‌లో ఒక దశలో ఓటమికి చేరువైనా...మలింగ చలువతో గట్టెక్కింది. దాంతో ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు కెప్టెన్ మాథ్యూస్ ఈ పేసర్‌నే నమ్ముకున్నాడు. అయితే భారత్‌పై మలింగ రికార్డు చెత్తగా ఉంది. అతని కెరీర్ సగటు 27 కాగా, భారత్‌పై అది 42గా ఉంది! సరిగ్గా రెండేళ్ల క్రితం హోబర్ట్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్... మలింగ వేసిన 15 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఏకంగా 44 పరుగులు బాదాడు. పైగా గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసినా...ఆరంభంలో ప్రభావం చూపలేకపోయాడు.
బంగ్లాతో వన్డేలో తిరిమన్నె సెంచరీతో చెలరేగగా, మాథ్యూస్ కూడా ఆకట్టుకున్నాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే విఫలమవుతున్నా...మరో సీనియర్ సంగక్కర సూపర్ ఫామ్ జట్టుకు కలిసి రానుంది. గత 10 వన్డేల్లో అతను ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు చేశాడు. తిసార పెరీరా కూడా ఏ దశలోనైనా దూకుడుగా ఆడగలడు. బౌలింగ్‌లో కొత్త కుర్రాడు డిసిల్వతో పాటు సేననాయకే ఆకట్టుకున్నారు. అయితే మలింగ మినహా ఎవరికీ పెద్దగా అనుభవం లేకపోవడం ఆ జట్టు బలహీనత. కాబట్టి శ్రీలంక బ్యాటింగ్‌లో మెరిస్తేనే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు. పాక్‌పై ఇప్పటికే గెలిచిన లంక ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఆ జట్టు ఫైనల్ అవకాశాలు మెరుగు పడతాయి. లంక ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రాయుడు, కార్తీక్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఆరోన్/పాండే.
శ్రీలంక: మాథ్యూస్ (కెప్టెన్), కుషాల్ పెరీరా, తిరి మన్నె, సంగక్కర, జయవర్ధనే, చండీమల్, తిసార పెరీరా, డిసిల్వ, సేననాయకే, మలింగ, లక్మల్.