టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న (నవంబర్ 2) జరిగిన రసవత్తర సమరం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ, చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మోసం చేసి గెలిచిందని బంగ్లాదేశ్ ఆటగాళ్లు, అభిమానులు బాహాటంగా ఆరోపిస్తుండటం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బంగ్లా అభిమానులు.. చీటింగ్, ఫేక్ ఫీల్డింగ్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేస్తే అందుకు అంపైర్లు సహకరించారని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లి అప్పీల్ చేయంగానే నో బాల్ ప్రకటించే అంపైర్లు, అదే వ్యక్తి తొండాట (బంతి చేతిలో లేకపోయిన వికెట్లపైకి త్రో చేస్తున్నట్లు నటించడం) ఆడుతుంటే చూసీచూడనట్లు ఎలా వ్యవహరిస్తారని నిలదీస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు మ్యాచ్ మొత్తం అంపైర్లు టీమిండియాకు అనుకూలంగానే వ్యవహరించారని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అంపైర్లు అవగాహనా రాహిత్యంగా వ్యవహరించారో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో కానీ మొత్తంగా మా కొంప మునిగిందని వాపోతున్నారు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ అంశంలో కనీసం థర్డ్ అంపైర్ అయినా కలగజేసుకుని ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు 5 పరుగులు కలిసొచ్చేవని, దాంతో తాము గెలిచేవారమని లబోదిబోమంటున్నారు.
#FakeFielding or not ???#Askthepavilion #PakVSa #NoBall pic.twitter.com/1Z25J8WVDV
— Muhammad Shehroz 🇵🇰 (@Iam_Shehroz) November 2, 2022
ఛేదనలో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసి లక్ష్యం దిశగా దూసుకుపోతున్న తమను వరుణుడు అడ్డగించి, తమ విజయావశాలపై నీళ్లు చల్లాడని ప్రకృతిపై విధ్వేశాన్ని వెల్లగక్కుతున్నారు. వర్షం వల్ల పిచ్‌పై తేమ చేరడంతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్న లిటన్ దాస్ రనౌటయ్యాడని, ఇదే తమ జట్టును లయ తప్పేలా చేసిందని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఇదే టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌లో కూడా అంపైర్లు ఇలాగే వ్యవహరించారని, ఆఖరి నిమషంలో భారత్‌కు సహకరించారని ఆరోపిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు కొన్ని తప్పిదాలను ఉద్ధేశపూర్వకంగా చేసినా ప్రశ్నించే వారే లేరని ఏకరవు పెడుతున్నారు. ఏదిఏమైనా కోహ్లి ఫేక్ ఫీల్డింగ్, అంపైరింగ్‌లో లోపాలు, వరుణుడి ఆటంకం తమ కొంప ముంచాయని బంగ్లా అభిమానులు వాపోతున్నారు. కాగా, బంగ్లా ఫ్యాన్స్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు భారత అభిమానులు సైతం ఓ రేంజ్‌లో కౌంటరిస్తున్నారు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేస్తుంటే బంగ్లా ఆటగాళ్లు అప్పుడేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఫలితం మీకు అనుకూలంగా వస్తే ఒకలా, వ్యతిరేకంగా వస్తే మరోలా ప్రవర్తించడం మీకు అలవాటేనని ఎదురుదాడికి దిగుతున్నారు. అదృష్టం కొద్దీ ఏదో నెదర్లాండ్స్, జింబాబ్వేలపై గెలవాగానే హీరోలమని ఫీలవుతున్నట్లున్నారని ఏకి పారేస్తున్నారు. ఆడలేక ఓడి, ప్రత్యర్ధిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని చురకలంటిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినా, అంపైర్ మీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా మీరెలా ప్రవర్తిస్తారో ప్రపంచం మొత్తం చూసిందని షకీబ్, బంగ్లా అండర్-19 జట్ల ఉదంతాలను ఉదహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment