సాక్షి, విశాఖపట్నం: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్ నేడు స్థానిక వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విశాఖ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సారథి కోహ్లి ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. ఇక రోహిత్ శర్మ తొలి సారి టెస్టుల్లో ఓపెనర్‌గా వస్తుండటంతో అందరి చూపు అతడి వైపే ఉంది. మరోవైపు స్థానిక కుర్రాడు హనుమ విహారిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. గత వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొట్టిన విహారి.. విశాఖ టెస్టులోనూ రాణించి అభిమానులను అలరించాలని కోరుకుంటున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు ప్రకటించిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది.
విశాఖ పిచ్ స్పిన్నర్లుకు అనుకూలించే అవకాశం ఉండటంతో దక్షిణాఫ్రికా ఏకంగా ముగ్గురు స్పిన్నర్లకు జట్టులోకి తీసుకుంది. ఇద్దరు పేసర్లు, ఓ ఆల్‌రౌండర్‌తో జట్టు కూర్పును సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా టెస్టు చాంపియన్ షిప్‌ను ప్రారంభించనుంది. ఇక వెస్టిండీస్ సిరీస్‌తో టెస్టు చాంపియన్ షిప్‌ను ఘనంగా ఆరంభించిన కోహ్లి సేన.. స్వదేశంలో సఫారీ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక టీమిండియాతో పోలిస్తే అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా ఏ మాత్రం పోటీనుస్తుందో వేచి చూడాలి. టెస్టు జరిగే రోజుల్లో వాన పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు అంతరాయం కలగడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.
తుది జట్లు:
భారత్ : కోహ్లి (సారథి), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, సాహా, అశి్వన్, జడేజా, ఇషాంత్, షమీ.
దక్షిణాఫ్రికా : డుప్లెసిస్ (సారథి), మార్క్‌రమ్, ఎల్గర్, బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, కేశవ్, రబడ, ముత్తుస్వామి, పీట్..
Comments
Please login to add a commentAdd a comment