కాచుకో... విండీస్‌ | India, West Indies start their WTC campaigns in Antigua | Sakshi
Sakshi News home page

కాచుకో... విండీస్‌

Published Thu, Aug 22 2019 4:35 AM | Last Updated on Thu, Aug 22 2019 4:40 AM

India, West Indies start their WTC campaigns in Antigua - Sakshi

కరీబియన్‌ పర్యటనలో భారత జట్టు చివరిదైన టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. జట్లకు ఏమోగానీ... ఇది టీమిండియా కెప్టెన్‌ కోహ్లి అరుదైన రికార్డులకు వేదికగా మారే వీలుంది. వన్డే ప్రపంచ కప్‌ వైఫల్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. భారత యువ ఓపెనర్లకు పరీక్షగా, స్పెషలిస్ట్‌ ఆటగాళ్లకు ప్రత్యేకంగా మారనున్న ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేసేది ఎవరో?

నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా): ఆసక్తి రేపుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ప్రయాణానికి నేటితో తెరలేవనునంది. కరీబియన్‌ దీవుల పర్యటనలో భాగంగా వెస్టిండీస్, భారత్‌ తొలి టెస్టు గురువారం ప్రారంభం కానుంది. 8 నెలల విరామం అనంతరం సంప్రదాయ ఫార్మాట్‌ బరిలో దిగుతున్న కోహ్లి సేనకు తుది జట్టు కూర్పు ఎలా అనే ఆలోచన తప్ప... గాయాలు, ఫామ్‌ లేమి వంటి ఇబ్బందులు లేవు. టి20, వన్డే సిరీస్‌లు కోల్పోయిన ప్రత్యర్థి వెస్టిండీస్‌ టెస్టుల్లోనైనా ప్రతాపం చూపాలని భావిస్తోంది. ఈ సిరీస్‌ కూడా ఓడితే ఆ జట్టు సొంతగడ్డపై తొలిసారిగా భారత్‌కు మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు కోల్పోయిన దారుణ రికార్డు మూటగట్టుకుంటుంది. బలాబలాలరీత్యా టీమిండియానే ఫేవరెట్‌ అయినప్పటికీ, విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం.

కోహ్లి ఓటు 5+1+5కేనా?
టెస్టుల్లో విజయానికి కెప్టెన్‌ కోహ్లి నమ్మే సూత్రం ఐదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఐదుగురు బౌలర్లు. మరీ ముఖ్యంగా విదేశాల్లో అతడు దీనిని ఎక్కువగా ఆచరిస్తాడు. ఈ లెక్కన చూస్తే మాత్రం ఆరో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌కు అవకాశం లేనట్లే. ప్రాధాన్య ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌కు చోటు ఖాయం. రెండో ఓపెనర్‌గా రాహుల్‌కు తెలుగు ఆటగాడు హనుమ విహారి పోటీ ఇస్తున్నాడు. వన్‌డౌన్‌లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లితో దుర్బేధ్యంగా ఉంది. ఇషాంత్‌ శర్మ, షమీ, బుమ్రా త్రయం పేస్‌ బాధ్యతలు మోస్తారు. మరో పేసర్‌ ఉమేశ్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. ఇద్దరు స్పిన్నర్ల వ్యూహానికి కట్టుబడితే అశ్విన్‌–జడేజా ద్వయం బరిలో దిగుతుంది. హార్దిక్‌ పాండ్యా దూరమైనందున లోయరార్డర్‌లో వీరిద్దరూ బ్యాట్‌తోనూ రాణించాల్సి ఉంటుంది.  

రహానే–రోహిత్‌ మధ్య కుర్చీలాట...
టీమిండియాకు కొన్నాళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానం ఎంత సమస్యగా మారిందో టెస్టుల్లో ఐదో స్థానం అంతే ఇబ్బంది కలిగిస్తోంది. వైస్‌ కెప్టెన్‌ హోదాలో ఓ బాధ్యత ఉన్న అజింక్య రహానే విఫలమవుతుండటమే దీనికి కారణం. రహానే సెంచరీ చేసి రెండేళ్లు దాటింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రంజీలు, ఇంగ్లండ్‌ కౌంటీల్లో తనను తాను పరీక్షించుకున్నా రహానే సాధించిందేమీ లేదు. ఇప్పుడు రోహిత్‌ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నాడు. వన్డే ప్రపంచ కప్‌ తర్వాత రోహిత్‌ స్థాయి పెరిగింది. టెస్టుల్లో వరుసగా అవకాశాలు ఇవ్వాలనే స్థితికి అది చేరింది.  మరి... ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ రహానేలలో కెప్టెన్‌ మొగ్గు ఎవరివైపు ఉంటుందో చూడాలి.  

విండీస్‌ ఎలా ఆడుతుందో?
ఈ ఏడాది మొదట్లో తమ దేశంలో పర్యటించిన ఇంగ్లండ్‌ను తొలి టెస్టులో 381 పరుగులతో; రెండోదాంట్లో 10 వికెట్లతో విండీస్‌ ఓడించింది. స్వదేశంలో కరీబియన్లు ప్రమాదకారులు అని చెప్పడానికి ఇదే సంకేతం. ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు పేసర్‌ రోచ్‌ నుంచి సవాలు తప్పదు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ చేజ్‌ సైతం గట్టి పిండమే. కెప్టెన్‌ హోల్డర్‌ ఆల్‌రౌండ్‌ పాటవం విండీస్‌కు సానుకూలాంశం. ఓపెనర్‌ బ్రాత్‌వైట్, హోప్, హెట్‌మైర్‌లతో బ్యాటింగ్‌లో జట్టు బలంగా ఉంది. మహాకాయుడు కార్న్‌వాల్‌ అరంగేట్రం చేయనున్నాడు.   

గెలిస్తే 120 పాయింట్లు...
రెండు మ్యాచ్‌ల సిరీసే కాబట్టి... డబ్ల్యూటీసీలో భాగంగా ఒక్కో టెస్టు విజయానికి 60 పాయింట్లు దక్కుతాయి. రెండూ గెలిస్తే 120 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతానికి భారత్‌ టాప్‌లోకి చేరుతుంది. న్యూజిలాండ్‌పై తొలి టెస్టు నెగ్గిన శ్రీలంక 60; యాషెస్‌లో మొదటి టెస్టు గెలిచి, రెండో టెస్టును డ్రాగా ముగించిన ఆస్ట్రేలియా 32 పాయింట్లతో ఉన్నాయి.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రాహుల్‌/విహారి, మయాంక్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానే/రోహిత్, పంత్‌/సాహా, జడేజా, అశ్విన్,షమీ, బుమ్రా, ఇషాంత్‌.
వెస్టిండీస్‌:బ్రాత్‌వైట్, కాంప్‌బెల్, హోప్, డారెన్‌ బ్రేవో, హెట్‌మైర్, చేజ్, డౌరిచ్, హోల్డర్‌ (కెప్టెన్‌), కార్న్‌వాల్‌/కీమో పాల్, రోచ్, గాబ్రియెల్‌.

పిచ్, వాతావరణం
ఇక్కడి సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ మైదానంలో రెండేళ్లుగా విండీస్‌ పేసర్లు, ప్రత్యేకంగా రోచ్‌ చెలరేగుతున్నాడు. 2018లో ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను 43 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలకంగా నిలిచాడు. ఈ జనవరిలో ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. పిచ్‌ స్వభావ రీత్యా పేసర్లకు ఈసారీ పండుగే. ఇంగ్లండ్‌తో టెస్టు అనంతరం ఈ పిచ్‌కు ఒక డీ మెరిట్‌ పాయింట్‌తో పాటు, బిలో యావరేజ్‌ రేటింగ్‌ ఇచ్చారు. అంటిగ్వాలో వాతావరణం మబ్బులు పట్టి ఉంది. మూడో రోజు నుంచి జల్లులు పడతాయి.

1: కోహ్లి మరొక్క సెంచరీ చేస్తే అత్యధిక శతకాలు బాదిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ (19) సరసన చేరతాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ 109 టెస్టుల్లో 25 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.  

26: కోహ్లి నేతృత్వంలో  ఆడిన 46 టెస్టుల్లో భారత్‌ గెలిచిన టెస్టుల సంఖ్య. మరోటి నెగ్గితే మాజీ కెప్టెన్‌ ధోని (60 మ్యాచ్‌ల్లో 27) అత్యధిక విజయాల రికార్డును అతడు సమం చేస్తాడు.


కోహ్లి సేన జలకాలాట
ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అనంతరం రెండు రోజుల విరామం లభించడంతో కోహ్లి సేన పూర్తిగా సేదదీరింది. కెప్టెన్‌ సహా ఆటగాళ్లు అంటిగ్వా బీచ్‌లో సందడి చేశారు. ‘కుర్రాళ్లతో ఓ అద్భుతమైన రోజు’ అంటూ మయాంక్, బుమ్రా, ఇషాంత్, పంత్, రహానే, రోహిత్, రాహుల్‌లతో ఉన్న ఫొటోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement