'వారికంటే టీమిండియానే బలమైన ప్రత్యర్థి'
పెర్త్: గతేడాది చివర్లో న్యూజిలాండ్, వెస్టిండీస్లపై ఘనవిజయాలు సాధించిన ఆస్ట్రేలియాకు మరో రెండు రోజుల్లో టీమిండియాతో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ ద్వారా అసలైన పోటీ ఉంటుందని మాజీ పేస్ బౌలర్ జెఫ్ లాసన్ స్పష్టం చేశాడు. కివీస్, విండీస్లపై ఆస్ట్రేలియా సాధించిన విజయాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదని.. ధోని సేన నేతృత్వంలోని టీమిండియాను ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు నిజమైన సవాల్ అని లాసన్ అభివర్ణించాడు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా మరింత ప్రమాదకారి అని తెలిపాడు.
ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఆసీస్ సాధించింది చెప్పుకోదగ్గ ఘనత కాదని, అలాగే ప్రాభవం కోల్పోయిన విండీస్ ను ఓడించడం కూడా స్మిత్ సేన పూర్తి సామర్థ్యం కిందకు రాదన్నాడు. సమవుజ్జీగా ఉన్న టీమిండియాను ఓడించడం అంత సులువు కాదన్న సంగతి ఆసీస్ ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నాడు. అప్పటికప్పుడు వచ్చిన విజయాలను చూసి మురిసిపోవడం ఆసీస్ కు అంత మంచికాదన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ తాత్కాలిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడం మానుకుని సుదీర్ఘమైన ప్రణాళికలతో ముందుకువెళ్లాలని లాసెన్ సూచించాడు. ఇప్పట్నుంచే 16 నుంచి 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగలిగితే 2019 వరల్డ్ కప్ నాటికి ఆసీస్ పూర్తిస్థాయిలో బరిలోకి దిగడానికి అవకాశం ఉంటుందన్నాడు.