
సెమీఫైనల్లో భారత కబడ్డీ జట్టు జయభేరి
అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో థాయ్ లాండ్ తో తలపడిన భారత్ విజయ దుందుభి మోగించింది. మొదటి నుంచి ఆదిపత్యం ప్రదర్శించిన భారత జట్టు పత్యర్ధి జట్టుకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
తొలి అర్ధభాగంలో 36-08తో భారత్ జట్టు థాయ్ లాండ్ ను తన దరిదాపుల్లోకి కూడా చేరుకుండా చేసింది. కాగా, భారత్ తరఫున సందీప్ నర్వాల్ తొలి అర్ధభాగంలో వరుసగా ఏడు రైడ్లలో పాయింట్లు సాధించాడు. ఇందులో ఓ సూపర్ రైడ్ కూడా ఉంది. మ్యాచ్ మొత్తం మీద థాయ్ లాండ్ ను భారత్ నాలుగు సార్లు ఆలౌట్ చేసింది.
థాయ్ లాండ్ పేలవ ప్రదర్శన
మ్యాచ్ ఆసాంతం థాయ్ లాండ్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. భారత ఆటగాళ్ల ప్రదర్శన ముందు వారు చిన్నబోయారు. రైడ్ కు వెళ్లిన వారు వెళ్లినట్లే ఔటయ్యారు. పాయింట్లు తెచ్చేందుకు తంటాలు పడ్డారు. తొలి సెట్లో భారత్ రెండంకెల పాయింట్లు సాధించే వరకూ థాయ్ లాండ్ ఖాతాలో ఒక్క పాయింట్ కూడా చేరలేదంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.
చుట్టేశారు
మొదటి అర్ధభాగంలోనే భారీ లీడ్ లోకి తీసుకెళ్లిన భారత ఆటగాళ్లు చివరి అర్ధభాగంలో చెలరేగి పోయారు. ఎనిమిది పాయింట్ల నుంచి థాయ్ లాండ్ ను ముందుకు పోనివ్వకుండా 51-08కు చేరుకున్నారు. మ్యాచ్ మొత్తం మీద సందీప్ నర్వాల్ ఒక్కడే 10 పాయింట్లు సాధించాడు. నర్వాల్ రైడింగ్ వెళ్లిన సమయంలో అతన్ని పట్టుకోబోయిన ఓ థాయ్ లాండ్ ఆటగాడి తలకు గాయమైంది. రెండు టీమ్ ల మధ్య పాయింట్లలో బాగా వ్యత్యాసం పెరిగిపోవడంతో భారత్ తన రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను రంగంలోకి దించి పరీక్షించుకుంది. దీంతో కొంచెం పుంజుకున్నట్లు కనిపించిన థాయ్ లాండ్ 73-20తో మ్యాచ్ ను కోల్పోయింది. కాగా ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇరాన్ తో తలపడనుంది.