
కబడ్డీ విశ్వవిజేత భారత్
అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్-2016ను భారత్ కైవసం చేసుకుంది. మొదటి అర్ధభాగం నుంచి దూకుడైన ఆటతీరుతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగంలో ఆచితూచి ఆడిన ఇరు జట్లు అనవసర తప్పిదాలకు పోకుండా నువ్వానేనా అన్నరీతిలో పోరాడాయి.
ఒక దశలో ఇరాన్ 10-07పాయింట్లతో లీడ్ లోకి వెళ్లగా ఓ సూపర్ టాకిల్ తో భారత్ తిరిగి ఫాం అందుకుంది. అయితే, తొలి అర్ధం భాగం చివరకు ఇరాన్ జట్టు వరుస రైడ్లలో భారత ఆటగాళ్లను అలౌట్ చేసి 18-13 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫస్ట్ హాఫ్ లో ఇరాన్ జట్టు ఎక్కువ రైడింగ్ పాయింట్లను సాధించింది.
భారత్ పైచేయి
రెండో అర్ధభాగం ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లకు బోనస్ పాయింట్లను సాధ్యమైనంత వరకూ ఇవ్వకుండా ఉండటానికి ఇరాన్ ప్రయత్నించింది. అయితే ఇరాన్ పై ఎదురుదాడికి దిగిన భారత ఆటగాళ్లు 21-20తో ఆధిక్యం సంపాదించారు. భారత ఆటగాళ్లలో అజయ్ ఠాకూర్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడమే కాక ఇరాన్ ను అలౌట్ చేసి భారత ఆధిక్యాన్ని 24-21కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా విజృంభించిన అజయ్ మ్యాచ్ మొత్తం మీద 10కి పైగా రైడ్ పాయింట్లు సాధించి ఇరాన్ నడ్డివిరిచాడు.
రైడింగ్ కు వచ్చిన ఇరాన్ రైడర్లకు అవకాశమివ్వని భారత ఆటగాళ్లు ఆధిక్యాన్ని 27-21కి పెంచి మ్యాచ్ పై పట్టు సంపాదించింది. దీంతో ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. పాయింట్లను తెచ్చేందుకు ఇరాన్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలం చెందడటంతో పాటు మరో మారు అలౌట్ అయ్యారు. దీంతో భారత ఆధిక్యం 34-24కు పెరిగింది. భారత ఆటగాళ్లలో తోమర్ కూడా ఐదు రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు.
ఆఖరి రెండు నిమిషాల్లో రైడింగ్ వెళ్లిన ఇరాన్ ఆటగాడు మీరాజ్ మెరుపు విన్యాసంతో రెండు పాయింట్లు సాధించి ఇరాన్ శిబిరంలో ఆశలు నింపాడు. చివరి నిమిషంలో చాన్స్ కోసం యత్నించిన ఇరాన్ ఆశలను ఆడియాసలు చేసి 38-29 తేడాతో భారత్ వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీలో అత్యధిక రైడింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా అజయ్ ఠాకూర్ నిలిచాడు.