
భారత మహిళలదే ట్రోఫీ
లీగ్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ... భారత మహిళల క్రికెట్ జట్టు నాలుగు దేశాల వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది.
ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో జయభేరి
నాలుగు దేశాల వన్డే టోర్నీ
పోట్చెఫ్‌స్ట్రూమ్: లీగ్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ... భారత మహిళల క్రికెట్ జట్టు నాలుగు దేశాల వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ పూనమ్ రౌత్ (92 బంతుల్లో 70 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మిథాలీరాజ్ (79 బంతుల్లో 62 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 40.2 ఓవర్లలో 156 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఓపెనర్ సునే లువుస్ (74 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. పేసర్ జులన్ గోస్వామి (3/22)తో పాటు స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/32), శిఖా పాండే (2/23) సఫారీల పతనాన్ని శాసించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. దీప్తి శర్మ (8), మోనా (2) విఫలమైనా... పూనమ్ రౌత్, మిథాలీలిద్దరూ వీరోచిత పోరాటం చేశారు. మూడో వికెట్‌కు అజేయంగా 127 పరుగులు జోడించారు.
రికార్డులు సమం...
ఫైనల్లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా మిథాలీ రాజ్ గతంలో వరుసగా ఆరు అర్ధ సెంచరీలు చేసిన లిండ్సే రీలర్, ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా), చార్లట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసింది. అంతేకాకుండా చార్లట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్–46) పేరిట ఉన్న అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును కూడా మిథాలీ సమం చేసింది. కెప్టెన్‌గా మిథాలీకిది 100వ మ్యాచ్. చార్లట్ ఎడ్వర్డ్స్ (117), బెలిండా క్లార్క్ (101; ఆసీస్) తర్వాత అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో మహిళా క్రికెటర్‌గా మిథాలీ గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్‌లోనే అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా జులన్ గోస్వామి (53 క్యాచ్‌లు) రికార్డు నెలకొల్పింది.