ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికాపై 10 వికెట్లతో గెలుపు
చెన్నై: ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కినా దక్షిణాఫ్రికా మహిళల జట్టు పరాజయాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది. భారత బౌలర్లు మరోసారి సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వొల్‌వార్ట్ (314 బంతుల్లో 122; 16 ఫోర్లు) పట్టుదలతో పోరాడి తమ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించింది.
మ్యాచ్ చివరిరోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 232/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 154.4 ఓవర్లలో 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు శుభ సతీశ్ (13 నాటౌట్; 1 ఫోర్), షఫాలీ వర్మ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇబ్బంది పడకుండా 9.2 ఓవర్లలో 37 పరుగులు సాధించి భారత్‌కు 10 వికెట్లతో విజయాన్ని అందించారు. అంతకుముందు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 93తో ఆట కొనసాగించిన లౌరా సెంచరీని పూర్తి చేసుకుంది.
అనంతరం లౌరాను రాజేశ్వరి గైక్వాడ్ అవుట్ చేశాక దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన నదినె డి క్లెర్క్ (185 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్‌గా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత టెస్టు చరిత్రలో 10 వికెట్లతో విజయం ఇది రెండోది మాత్రమే. 2002లో దక్షిణాఫ్రికాపైనే భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 603/6 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 266 ఆలౌట్;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 373 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 37/0 (9.2 ఓవర్లలో).
Comments
Please login to add a commentAdd a comment