భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు కోహ్లి తొందరగా ఔటైతే ఒక లెక్క... అతను క్రీజ్‌లో ఉంటే మరో లెక్క...విరాట్ దీనిని మరోసారి చేసి చూపించాడు. తొలి మ్యాచ్ వైఫల్యం తర్వాత ఇప్పుడు మరో అద్భుత సెంచరీతో భారత కెప్టెన్ జట్టును విజయం దిశగా నడిపించాడు. శుభారంభాన్ని కొనసాగించడంతో పాటు చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా సాధికారికంగా ఆడిన కోహ్లి సిరీస్‌లో జట్టును సమంగా నిలిపాడు. అంతకు ముందు చక్కటి బౌలింగ్‌తో భువనేశ్వర్ ఆసీస్‌ను దెబ్బ తీసి భారత్‌కు భారీ లక్ష్యం నిర్దేశించకుండా అడ్డుకున్నాడు.
కెప్టెన్ మాటల్లో చెప్పాలంటే అది ‘ఎమ్మెస్ క్లాసిక్’... మరికొంత కాలం వరకు విమర్శకులకు ఎలాంటి అవకాశం ఇవ్వని ఇన్నింగ్స్‌తో ధోని తన విలువేంటో చూపించాడు. 42 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలో 50 ఓవర్ల కీపింగ్ తర్వాత బ్యాటింగ్‌లో దాదాపు 20 ఓవర్లు నిలబడి టీమ్‌ను విజయతీరం చేర్చడంలో పాత ధోనిని గుర్తుకు తెచ్చాడు. వేడితో కుప్పకూలే స్థితిలోనూ సింగిల్స్ కోసం తగ్గని శైలితో పాటు సిక్సర్‌తో స్కోరును సమం చేయడం వరకు మాజీ కెప్టెన్ తన మహిమను చూపిస్తే... మరో ఎండ్‌లో కార్తీక్ ‘ఫినిషర్’ పాత్రను సమర్థంగా పోషించాడు.
అడిలైడ్: సంక్రాంతి పండగ రోజున భారత క్రికెట్ జట్టు అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఆసక్తికరంగా సాగిన పోరులో విజేతగా నిలిచి సిరీస్ ఫలితాన్ని ఆఖరి పోరు వరకు తీసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.షాన్ మార్ష్ (123 బంతుల్లో 131; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (37 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ (4/45) మెరుగైన ప్రదర్శన నమోదు చేయగా, షమీకి 3 వికెట్లు దక్కాయి.
మరింత భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్న దశలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ 3 పరుగులకే చివరి 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 4 వికెట్లకు 299 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (112 బంతుల్లో 104; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మహేంద్ర సింగ్ ధోని (54 బంతుల్లో 55 నాటౌట్; 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (52 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... సిరీస్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
మార్ష్ దూకుడు...
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరోసారి పేలవంగా ప్రారంభమైంది. భువీ చక్కటి బంతికి కెప్టెన్ ఫించ్ (6) బౌల్డ్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే బౌన్సర్‌తో కారీ (18)ని షమీ ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాయి. మార్‡్ష, ఉస్మాన్ ఖాజా (21) కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు నిలదొక్కుకుంటున్న దశలో జడేజా అద్భుతమైన డైరెక్ట్ త్రోకు ఖాజా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపు మార్‡్షకు అండగా నిలిచిన హ్యాండ్స్‌కోంబ్ (20)...జడేజా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత మార్ష్ తో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం స్టొయినిస్ (29) కూడా వెనుదిరిగాడు.
ఈ స్థితిలో ఆరో వికెట్‌కు షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్ కలిసి జోడించిన 94 పరుగులు ఆసీస్‌కు మెరుగైన స్కోరును అందించాయి. కుల్దీప్ ఓవర్లో వీరిద్దరు భారీ సిక్సర్లు బాదడంతో 16 పరుగులు రాగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ మూడు ఫోర్లు కొట్టారు. ఈ క్రమంలో 108 బంతుల్లో మార్ష్ శతకం పూర్తయింది. వీరిద్దరి జోరుతో 47 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 281/5. అయితే ఇక్కడ ఆట మలుపు తిరిగింది. 48వ ఓవర్లో మ్యాక్స్‌వెల్, మార్ష్ లను ఔట్ చేసిన భువీ...చివరి ఓవర్లో సిడిల్ (0) వికెట్ కూడా తీశాడు. అంతకు ముందు ఓవర్లో రిచర్డ్సన్ (2)ను షమీ పెవిలియన్ పంపించాడు. ఫలితంగా 50వ ఓవర్లో వచ్చిన సిక్స్, ఫోర్ సహా చివరి 3 ఓవర్లలో ఆసీస్ 16 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సమష్టి భాగస్వామ్యాలు...
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తరహాలోనే భారత్ బ్యాటింగ్‌లో కూడా నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉండటం విశేషం. ఐదో వికెట్ వరకు బ్యాట్స్‌మెన్ వరుసగా 47, 54, 59, 82, 57 పరుగులు జత చేయడం విశేషం. ఓపెనర్లు రోహిత్, ధావన్ (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) దూకుడుగా ఆడి శుభారంభం అందించారు. స్వేచ్ఛగా ఆడిన ధావన్‌ను బెహ్రన్‌డార్ఫ్ ఔట్ చేయడంతో ఎనిమిదో ఓవర్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్‌తో కీలక భాగస్వామ్యం తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి కొద్ది సేపటికే రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించిన రాయుడు (36 బంతుల్లో 24; 2 ఫోర్లు)ను మ్యాక్స్‌వెల్ వెనక్కి పంపించాడు.
ఈ దశలో కెప్టెన్, మాజీ కెప్టెన్ పార్ట్‌నర్‌షిప్ జట్టును ముందుకు నడిపించింది. భారీ షాట్లు ఆడకపోయినా సింగిల్స్‌పైనే వీరిద్దరు దృష్టి పెట్టి చకచకా పరుగులు సాధించారు. సిడిల్ బౌలింగ్‌లో డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఆడటంతో 108 బంతుల్లో కోహ్లి శతకం పూర్తయింది. ఆ వెంటనే అతని వికెట్ తీసిన ఆసీస్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ధోని, కార్తీక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. విరాట్ వెనుదిరిగాక విజయానికి 38 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యం చేరింది.
సిరాజ్‌కు కలిసిరాని అరంగేట్రం
హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ భారత్ తరఫున వన్డేలు ఆడిన 225వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2 అంతర్జాతీయ టి20లు ఆడిన అనంతరం అతనికి వన్డే అవకాశం దక్కింది. అయితే తొలి టి20లాగే తొలి వన్డే కూడా అతనికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అడిలైడ్ వన్డేలో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చిన అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. భారత్ తరఫున కర్సన్ ఘావ్రీ (0/83) తర్వాత అరంగేట్రంలో అతి చెత్త ప్రదర్శన సిరాజ్‌దే. ఏడాది క్రితం తన తొలి టి20లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చి 1 వికెట్ తీసిన సిరాజ్... జోగీందర్ శర్మ (0/57) తర్వాత అరంగేట్రంలో రెండో చెత్త గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment