అంతర్జాతీయ టి20లు ప్రారంభమై 15 ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకు 1037 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ క్రమంలో గతంలో ఏ జట్టుకూ సాధ్యంకాని ఘనతను భారత్ సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో ఐదో మ్యాచ్‌లో సమష్టిగా మెరిపించిన టీమిండియా ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది.
మౌంట్‌మాంగని: న్యూజిలాండ్‌లో భారత్ ‘పొట్టి’ చరిత్రకెక్కింది. టీమిండియా టి20ల్లో తొలిసారి 5–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి బుమ్రా (4–1–12–3) తన పేస్ పదునుతో న్యూజిలాండ్ గెలుపు దారిని ఓటమి వైపు మళ్లించాడు. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
కుగ్లిన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడింది. రాస్ టేలర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సీఫెర్ట్ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్, సైనీ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. మూడు వన్డేల సిరీస్ హామిల్టన్‌లో ఈనెల 5న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.
రాహుల్ మళ్లీ జిగేల్...
ఈసారి టాస్ భారత్ నెగ్గింది. గత రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు కివీస్‌ను అనూహ్యంగా కట్టడి చేయడం దృష్ట్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. చివరకు ఇక్కడ అదే జరిగింది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన సంజూ సామ్సన్ (2) సువర్ణావకాశాన్ని చేజార్చుకోగా... ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి స్థానంలో పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ... వన్‌డౌన్‌లో విరాట్ పాత్ర పోషించాడు. అయితే రోహిత్ ఆరంభంలో కాస్త నింపాదిగా ఆడగా... రాహుల్ తన జోరు కొనసాగించాడు. సౌతీ వేసిన 3వ ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్స్‌లో 6, కవర్ పాయింట్, డీప్‌స్క్వేర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు.
దీంతో 5.1 ఓవర్లోనే భారత్ 50కి చేరింది. ధాటిగా ఆడుతున్న రాహుల్‌ను 12వ ఓవర్లో బెన్నెట్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్లో రోహిత్ ఫోర్ బాదడంతో జట్టు స్కోరు 100కు చేరింది. రోహిత్ 35 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఇతని అండతో శ్రేయస్ అయ్యర్ (31 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అడపాదడపా షాట్లు ఆడాడు. కాసేపటికే రోహిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... శివమ్ దూబే (5) నిరాశపరిచాడు. మనీశ్ పాండే (4 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బాదడంతో జట్టు స్కోరు 163కు చేరింది.
రాణించిన సీఫెర్ట్...
లక్ష్యఛేదనలో ఓపెనర్లు గప్టిల్ (2), మన్రో (15) సహా... బ్రూస్ (0) వికెట్లను 17 పరుగులకే కోల్పోవడంతో భారత్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది. బుమ్రా, సుందర్ ఓపెనర్లను ఔట్ చేస్తే, బ్రూస్ రనౌటయ్యాడు. అయితే సీఫెర్ట్, టేలర్‌ల జోడీ టీమిండియా ఉత్సాహంపై నీళ్లుచల్లింది. 12.3 ఓవర్ల దాకా మరో వికెట్ ఇవ్వకుండా కివీస్‌ను 116 స్కోరుకు తెచ్చింది. ఈ క్రమంలో సీఫెర్ట్ (29 బంతుల్లో), టేలర్ (42 బంతుల్లో) అర్ధసెంచరీలను పూర్తిచేసుకున్నారు.
భారత్ క్లీన్‌స్వీప్‌కు అడ్డుగా నిలిచిన ఈ జోడీని సైనీ విడగొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మిచెల్ (2)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 16 ఓవర్లలో 129/5. ఇక 24 బంతుల్లో 35 చేస్తే కివీస్ గెలుస్తుంది. ఆఖరికి పరువు నిలుస్తుంది. కానీ తర్వాత ఓవర్ వేసిన శార్దుల్ మూడు బంతుల వ్యవధిలో సాన్‌ట్నర్ (6), కుగ్లిన్ (0)లను పెవిలియన్ చేర్చడంతో గెలుపు కథ అడ్డం తిరిగింది. మరుసటి ఓవర్లో సైనీ క్రీజులో పాతుకుపోయిన టేలర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. 19 ఓవర్ వేసిన బుమ్రా కెప్టెన్ సౌతీ (6)ని అవుట్ చేసి 3 పరుగులే ఇచ్చాడు. దీంతో 12 బంతుల్లో 24 పరుగుల సమీకరణం కాస్త ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 21 పరుగులుగా పెరిగిపోయింది. శార్దుల్ బౌలింగ్‌లో సోధి 2 సిక్సర్లతో మెరిపించాడే కానీ గెలిపించలేకపోయాడు.
దూబే ఓవర్లో 34....
అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా, భారత్ నుంచి తొలి బౌలర్‌గా శివమ్ దూబే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో అతను 6, 6, 4, 1, నోబ్+4, 6, 6లతో మొత్తం 34 పరుగులు సమర్పించుకున్నాడు. కివీస్ ‘గేర్’ మార్చిన ఈ ఓవర్లో సీఫెర్ట్, టేలర్‌లు చెరో 2 సిక్సర్లు బాదేశారు. అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ రికార్డు స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్... 2007లో భారత్‌పై 36 పరుగులు; యువరాజ్ 6 సిక్స్‌లు) పేరిట ఉంది. మ్యాచ్ మొత్తంలో బుమ్రా 4 ఓవర్లేసి 12 పరుగులే ఇస్తే... దూబే ఒకే ఒక్క ఓవర్‌తో 3 రెట్లు ఎక్కువ పరుగులిచ్చుకున్నాడు. దీంతో మళ్లీ అతన్ని బౌలింగ్‌కు దించలేదు.
►1 ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కిదే తొలిసారి. విదేశీ గడ్డపై సిరీస్‌లను వైట్‌వాష్ చేయడం భారత్‌కిది మూడోసారి. 2016లో 3–0తో ఆస్ట్రేలియాను, గతేడాది 3–0తో వెస్టిండీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది.
►3 ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 100 అంతర్జాతీయ టి20లు ఆడిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో షోయబ్ మాలిక్ (113–పాకిస్తాన్), రోహిత్ శర్మ (108–భారత్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
►1 అంతర్జాతీయ టి20ల్లో ఇన్నింగ్స్‌లో 50 అంతకంటే ఎక్కువ స్కోరు అత్యధికసార్లు చేసిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ (25) నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లి (24 సార్లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు.
►8 అంతర్జాతీయ టి20ల్లో భారత్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో మూడుసార్లు భారత్ వరుసగా ఏడేసి మ్యాచ్‌ల్లో గెలిచింది.
సూపర్... సామ్సన్
న్యూజిలాండ్‌తో ఐదో టి20 మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజూ సామ్సన్ ఓపెనర్‌గా విఫలమయ్యాడు. కానీ ఫీల్డర్‌గా సూపర్ సామ్సన్ అయ్యాడు. మెరుపు విన్యాసంతో భారీ సిక్సర్‌ను ఆడ్డుకున్నాడు. 8వ ఓవర్లో శార్దుల్ వేసిన ఆఖరి బంతిని టేలర్ మిడ్‌వికెట్ మీదుగా భారీషాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద కాచుకున్న సామ్సన్ ఎంతో ఎత్తులో సిక్సర్‌గా వెళ్తున్న బంతిని అమాంతం ఎగిరి అందుకున్నాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ అవతల పడబోతున్న అతను మెరుపు వేగంతో బంతిని మైదానం లోపలకు విసిరాడు. 6 పరుగులొచ్చే చోట కేవలం 2 పరుగులే వచ్చాయి. అయితే ఇదంతా రెప్పపాటులో జరిగిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇదే పెద్ద హైలైట్!
మా వాళ్లంతా అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. మా అంచనాలకు తగ్గట్లే జట్టుకు అవసరమైనపుడు వందకు 120 శాతం ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధంగా ఉండటంవల్లే ఇప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. మా అందరి లక్ష్యం విజయమే. అందుకే గత మూడేళ్లుగా జట్టులో ఎంతో మార్పు వచ్చింది. ఎంతో ప్రగతి సాధించింది. ఇక న్యూజిలాండ్ గురించి చెప్పాల్సి వస్తే ఆ జట్టు వైట్‌వాష్ అయినప్పటికీ ఓ సమర్థ సారథి చేతుల్లోనే ఉంది. కేన్ విలియమ్స్‌ది, నాది ఒకే విధమైన ఆలోచన. మా దేశాలు వేరు కావొచ్చేమో కానీ మా ఇద్దరి మైండ్‌సెట్లు ఒక్కటే. –భారత కెప్టెన్ కోహ్లి
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) సాన్‌ట్నర్ (బి) బెన్నెట్ 45; సంజూ సామ్సన్ (సి) సాన్‌ట్నర్ (బి) కుగ్లిన్ 2; రోహిత్ (రిటైర్డ్ హర్ట్) 60; శ్రేయస్ (నాటౌట్) 33; శివమ్ దూబే (సి) బ్రూస్ (బి) కుగ్లిన్ 5; మనీశ్ పాండే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–8, 2–96, 3–148. బౌలింగ్: సౌతీ 4–0–52–0, కుగ్లిన్ 4–0–25–2, బెన్నెట్ 4–0–21–1, సోధి 4–0–28–0, సాన్‌ట్నర్ 4–0–36–0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 2; మన్రో (బి) వాషింగ్టన్ సుందర్ 15; సీఫెర్ట్ (సి) సామ్సన్ (బి) సైనీ 50; బ్రూస్ (రనౌట్) 0; రాస్ టేలర్ (సి) రాహుల్ (బి) సైనీ 53; మిచెల్ (బి) బుమ్రా 2; సాన్‌ట్నర్ (సి) పాండే (బి) శార్దుల్ 6; కుగ్లిన్ (సి) సుందర్ (బి) శార్దుల్ 0; సౌతీ (బి) బుమ్రా 6; సోధి (నాటౌట్) 16; బెన్నెట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–17, 4–116, 5–119, 6–131, 7–132, 8–133, 9–141. బౌలింగ్: సుందర్ 3–0–20–1, బుమ్రా 4–1–12–3, సైనీ 4–0–23–2, శార్దుల్ 4–0–38–2, చహల్ 4–0–28–0, దూబే 1–0–34–0.
Comments
Please login to add a commentAdd a comment