
ఫైనల్లో సైనాకు నిరాశ
పుజోహ్(చైనా): వరుసగా రెండో ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టైటిల్ ను సాధించాలనుకున్నభారత స్టార్ షట్లర్, వరల్డ్ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సైనా 12-21, 15-21 తేడాతో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జురుయ్(చైనా)చేతిలో ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది. తొలి సెట్ ఆదిలో సైనా 4-1 తో ఆధిక్యం దిశగా కొనసాగినా.. ఆ తరువాత అనూహ్యం వెనుకబడి పరాజయం చెందింది. తొలి గేమ్ లో సైనా అనవసర తప్పిదాలు చేయడంతో లీ జురుయ్ 14-9తో ముందంజ వేసింది. ఇదే ఊపును కడవరకూ కొనసాగించిన లీ జురుయ్ తొలి సెట్ ను కైవసం చేసుకుంది.
కాగా, రెండో సెట్ లో సైనా పోరాడి ఓడింది. రెండో గేమ్ లో సైనా 9-5, 11-6 తో ఆధిక్యంలోకి వెళ్లినా లీ జురుయ్ తిరిగి పుంజుకుంది. వరుసగా బ్రేక్ పాయింట్లను సాధిస్తూ సైనాను వెనక్కు నెట్టింది. ఈ క్రమంలో రెండో సెట్ ను లీ జురుయ్ 21-15 తేడాతో సాధించి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను ఎగురేసుకుపోయింది. దీంతో ముఖాముఖి రికార్డును లీ జురుయ్ 10-2తో మెరుగుపరుచుకుంది.