కాంస్యంతో సరి
కున్ షాన్(చైనా): ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత్ 0-3 తేడాతో చైనాపై ఓటమి చెందడంతో కాంస్యంతోనే నిష్ర్కమించాల్సి వచ్చింది. సెమీ ఫైనల్లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 15-21, 21-12, 17-21 తేడాతో లీ జురయ్ చేతిలో పరాజయం చవిచూడగా, ఆ తరువాతి మ్యాచ్ లో మరో భారత క్రీడాకారిణి పివి సింధు 13-21, 21-23 తేడాతో షియాన్ వాంగ్ చేతిలో ఓటమి చెందింది.
ఇక డబుల్స్ విభాగంలో భారత జోడి గుత్తా జ్వాలా-సిక్కి రెడ్డిలు 6-21, 6-21 తేడాతో కిన్ తియాన్-యున్లీ హో చేతిలో పరాజయం పాలైంది. దీంతో చైనా 3-0 తేడాతో సంపూర్ణం ఆధిక్యంలో నిలిచి ఫైనల్ కు చేరింది. ఇప్పటివరకూ 13 సార్లు ఉబెర్ కప్ టైటిల్స్ గెలిచిన చైనా మరో టైటిల్ సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. చైనా తన తుదిపోరులో జపాన్-దక్షిణకొరియా జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ విజేతతో తలపడనుంది.