
న్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ 12 పతకాలు సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. దీంతో భారత బాక్సింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఫైనల్లో తమన్నా 5–0తో అలెనా ట్రెమసొవా (రష్యా)పై ఏకపక్ష విజయం సాధించడంతో ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ కేటగిరీలో కూడా అవార్డు పొందింది. మిగతా ఫైనల్ బౌట్లలో అంబేశొరి 3–2తో డ్యునా సిపెల్ (స్వీడన్)పై, ప్రీతి దహియా 3–2తో క్రిస్టినా కర్టత్సెవా (ఉక్రెయిన్)పై నెగ్గారు. ప్రియాంక 5–0తో ఓల్గా పెట్రష్కొ (రష్యా)ను కంగుతినిపించింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్సి దలాల్ (75 కేజీలు), తనిశ్‌బిర్ కౌర్ సంధు (80 కేజీలు) రజతాలు నెగ్గగా, ఆశ్రేయ (63 కేజీలు), నేహా (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో 13 మంది సభ్యులతో కూడిన భారత బృందం 12 పతకాలు గెలుపొందడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment