హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా వైఫల్యం కావడంతో అతని కెరీర్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రోహిత్ శర్మను సైతం కాదని రాహుల్‌ను జట్టులో తీసుకోవడం సబబు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగిన రాహుల్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. కాగా, ఇలా రాహుల్ బౌల్డ్‌గా కానీ, ఎల్బీగా కానీ పెవిలియన్ చేరడం వరుసగా తొమ్మిదోసారి కావడం ఇక్కడ గమనార్హం. ప్రధానంగా ఫుట్‌వర్క్ సమస్యతో బాధపడుతున్న రాహుల్ చెత్త బంతులకు సైతం నిష్క్రమిస్తూ ఉండటం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవర పెడుతోంది.
మరొకవైపు యువ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి ఆకట్టుకున్నాడు. విండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసి శతకంతో మెరిసిన పృథ్వీ షా.. తాజా టెస్టు మ్యాచ్‌లో అర్థ శతకం నమోదు చేశాడు. 39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో రెండో రోజు లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. పృథ్వీ షా(52 బ్యాటింగ్), చతేశ్వర పుజారా(9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులకు ఆలౌటైంది. 295/7 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 16 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ విజృంభించి ఆరు వికెట్లతో సత్తా చాటాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్ యాదవ్ సాధించడం మరో విశేషం. ఇక కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, రవిచంద్రన్ అశ్విన్ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment