అత్యంత విలువైన ఆటగాళ్లు వీళ్లే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఈనెల 20న(సోమవారం) వేలం జరగనుంది. వేలానికి 351 మంది ఆటగాళ్లతో తుది జాబితా తయారు చేశారు. ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లున్నారు. తొలిసారిగా అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు కొత్త జాబితాలో చోటు దక్కడం విశేషం.
ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఏకంగా ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వచ్చే ఏడాది తమ ఆటగాళ్లతో అన్ని జట్లకు ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈసారి వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఐపీఎల్ తాజా వేలం నేపథ్యంలో గతంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1. డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015, ఐపీఎల్ లో రూ. 16 కోట్లుకు దక్కించుకుంది.
2. చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్లు నిషేధం పడడంతో ఎంఎస్ ధోనిని దక్కించుకునేందుకు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించింది.
3. రెండుసార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ ను తమ వద్దే ఉంచుకునేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 11.05 కోట్లు ముట్టజెప్పింది.
4. బరోడా బ్లాస్టర్ యూసఫ్ పఠాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.6 కోట్లుతో వేలంలో కొనుగోలు చేసింది.
5. రాబిన్ ఊతప్పను పుణే వారియర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.66 కోట్లతో దక్కించుకుంది. అయితే ధరకు తగినట్టు రాణించలేదు.