
మూడు దేశాల్లో ఐపీఎల్ పోటీలు!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఇండియన్ ప్రీమియర్ లీగ్పై ప్రభావం చూపాయి. భద్రత కారణాల రీత్యా ఎన్నికల సమయంలో భారత్లో ఐపీఎల్ నిర్వహణకు అనుమతి లభించలేదు. దీంతో పోటీలు మూడు దేశాల్లో నిర్వహించే అవకాశముంది. ఐపీఎల్ ఏడో అంచె పోటీలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఐపీఎల్-7 తొలి సగభాగం యూఏఈలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పోటీలు అక్కడే ఉంటాయి.
రెండో సగభాగం పోటీలు మే 1 నుంచి 12 వరకు బంగ్లాదేశ్ లేదా భారత్లో ఉంటాయి. మే 13 నుంచి చివరి దశ పోరు భారత్లో జరగనుంది. ఇదిలావుండగా, ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో మే 1 తర్వాత ఐపీఎల్ పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2009లో కూడా ఐపీఎల్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన దృష్ట్యా భద్రతకారణాల రీత్యా పోటీలకు అనుమతివ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికాలో పోటీలు నిర్వహించారు.