టోక్యో: బలమైన స్మాష్‌లు... మెరుగైన డ్రాప్ షాట్లు... నెట్ వద్ద పూర్తి అప్రమత్తంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు... జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మరోసారి మెరిసింది. . బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో యుకినో నకాయ్ (జపాన్)పై విజయం సాధించి తన సత్తాను చాటింది. కేవలం 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ మొత్తంలో ఏపీ అమ్మాయి ఆధిపత్యం కనబర్చింది.
తొలి గేమ్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచిన సింధు తర్వాత చెలరేగింది. దీంతో స్కోరు 10-4కు వెళ్లింది. ఈ దశలో మరోసారి విజృంభించిన ఆమె వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. యుకినో ఒకటి, రెండు పాయింట్లకే పరిమితం కావడంతో సింధు సులువుగా గేమ్‌ను సొంతం చేసుకుంది. 6-0తో రెండో గేమ్చ్‌లో ఆధిక్యంలోకి వచ్చాక సింధు కాస్త నెమ్మదించింది. దీంతో ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నారు. అయితే స్కోరు 16-13 ఉన్న దశలో సింధు డ్రాప్ షాట్లతో ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్ మొత్తంలో నెట్ వద్ద 21 పాయింట్లు గెలుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సింధు... క్వాలిఫయర్ అకానే యమగుచి (జపాన్)తో తలపడుతుంది.