p.v.sindhu
-
ఇషిత.. బ్యాడ్మింటన్‌లో చిరుత
పి.వి.సింధు భారత బ్యాడ్మింటన్ సంచలనం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించిన తెలుగు క్రీడాకారిణి. ఆమె అందించిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చిన్నారులు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదే స్ఫూర్తితో జిల్లాలోని గుంతకల్లుకు చెందిన ఇషిత బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడే అయిన తండ్రి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైంది. అనంతపురం సప్తగిరి సర్కిల్: గుంతకల్లుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సురేష్‌కుమార్, నర్మద దంపతుల కుమార్తె ఇషిత. పి.వి.సింధు స్ఫూర్తితో తండ్రి బాటలోనే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుంది. తాను ఎంచుకున్న లక్ష్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. తల్లిదండ్రుల తోడ్పాటు, కోచ్ ఫణికుమార్ అందించిన మెలకువలు తనను అండర్–14 విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యేలా చేశాయి. ప్రతిభకు పదును.. గుంతకల్లు పట్టణంలో కోచ్‌లు మౌళి, రహీమ్ వద్ద గేమ్ నేర్చుకున్న ఇషిత ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు అనంతపురంలోని స్మాష్ అకాడమీలో చేరింది. ఏడాదిన్నర వ్యవధిలోనే కోచ్ ఫణికుమార్ అందించిన మెలకువలతో ఉన్నత స్థాయికి చేరింది. ప్రత్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ సైడ్ డ్రాప్, హాఫ్ స్మాష్, ట్రిపుల్స్ ద్వారా ఆటలో పైచేయి సాధిస్తోంది. షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ల ద్వారా నిర్వహించే ర్యాంకింగ్ టోర్నీల్లో ప్రతిభ కనబరిచి మినీ స్టేట్ టోర్నీలో డబుల్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. చీరాలలో నిర్వహించిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఎంపికలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో జాతీయస్థాయి సింగిల్స్ విభాగంలో ఎంపికైంది. ఈనెలలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒలింపిక్సే లక్ష్యం పి.వి.సింధు లాగా ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. జాతీయస్థాయికి ఎంపికే దీనికి మొదటి అడుగుగా భావిస్తాను. రోజూ 4 నుంచి 5 గంటలపాటు సాధన చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ నేర్పిస్తున్న మెలకువలతోనే బ్యాడ్మింటన్‌లో రాణించగలుగుతున్నాను. ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటాను. – ఇషిత -
సింధూ విజయం కాంక్షిస్తూ..
మారీసుపేట: రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయం సాధించి బంగారు పతకం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తూ రామలింగేశ్వరపేటలోని అమిరినేని రెయిన్బో స్కూల్ విద్యార్థులు శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్య, పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
-
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, యోగా గారు బాబా రామ్‌దేవ్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, పండిట్ రవిశంకర్‌లను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించనుంది. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌తో పాటు మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామిలకు పద్మభూషణ్ పురస్కారాలు లభించనున్నాయి. భారత హాకీ టీం కెప్టెన్ సర్దార్‌సింగ్, తెలుగు తేజం-స్టార్ షట్లర్ పీవీ సింధులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌లను కూడా కేంద్రం పద్మ పురస్కారాలతో సత్కరించనుంది. ఈ నెల 25న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. * ఎల్.కె.అద్వానీ, అమితాబ్, శ్రీశ్రీ రవిశంకర్, బాబా రాందేవ్లకు పద్మవిభూషణ్ * దిలీప్ కుమార్ ఎన్. గోపాలస్వామికి పద్మభూషణ్ * పి.వి.సింధు, సర్దార్ సింగ్‌లకు పద్మశ్రీ * ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్లకు పద్మ అవార్డులు -
కాంస్య ‘సింధూ’రం
►సెమీస్‌లో ఓడిన హైదరాబాద్ అమ్మాయి ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో కాంస్యం ► ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు కోపెన్‌హాగెన్: గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్యం గాలివాటం కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి కాంస్యం సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయినా... కాంస్య పతకం దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కనీసం 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్లు నెట్‌కు తగిలాయి. కొన్నిసార్లు కరోలినా చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు రాబట్టింది. తొలి గేమ్‌లో ఒకదశలో 2-6తో వెనుకబడిన సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ముందంజ వేసింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేసి తేరుకోలేకపోయింది. 10-15తో వెనుకబడిన సింధు స్కోరును సమం చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయింది. తుదకు 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో తొలి గేమ్‌ను కోల్పోయి పుంజుకున్న సింధు ఈసారి మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ఒకదశలో సింధు 11-9తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత తడబాటుకు లోనైంది. సింధు ఒత్తిడిలో ఉందనే విషయాన్ని గ్రహించిన కరోలినా సమయస్ఫూర్తితో ఆడుతూ వరుసగా నాలుగు పాయింట్లు సంపాదించి 16-12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 19-21, 21-19, 21-15తో అద్భుత విజయం సాధించింది. కెరీర్లో షిజియాన్‌పై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సింధు క్వార్టర్ ఫైనల్లో షిజియాన్‌ను ఓడించింది. సైనాకు ఐదోసారి నిరాశ మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సైనా 15-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనా తాను ఆడిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు లభించిన నాలుగు పతకాలూ కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో కోపెన్హాగెన్లోనే జరిగిన పోటీల్లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో లండన్‌లో జరిగిన పోటీల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ విభాగంలో భారత్ ఖాతాలో రెండో కాంస్యాన్ని జతచేశారు. 2013లో చైనాలోని గ్వాంగ్జూలో జరిగిన పోటీల్లో... ఈ ఏడాది కోపెన్‌హాగెన్‌లో జరిగిన పోటీల్లో పి.వి.సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు అందించింది. -
మరోసారి మెరిసిన పి.వి.సింధు
టోక్యో: బలమైన స్మాష్‌లు... మెరుగైన డ్రాప్ షాట్లు... నెట్ వద్ద పూర్తి అప్రమత్తంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు... జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మరోసారి మెరిసింది. . బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో యుకినో నకాయ్ (జపాన్)పై విజయం సాధించి తన సత్తాను చాటింది. కేవలం 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ మొత్తంలో ఏపీ అమ్మాయి ఆధిపత్యం కనబర్చింది. తొలి గేమ్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచిన సింధు తర్వాత చెలరేగింది. దీంతో స్కోరు 10-4కు వెళ్లింది. ఈ దశలో మరోసారి విజృంభించిన ఆమె వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. యుకినో ఒకటి, రెండు పాయింట్లకే పరిమితం కావడంతో సింధు సులువుగా గేమ్‌ను సొంతం చేసుకుంది. 6-0తో రెండో గేమ్చ్లో ఆధిక్యంలోకి వచ్చాక సింధు కాస్త నెమ్మదించింది. దీంతో ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నారు. అయితే స్కోరు 16-13 ఉన్న దశలో సింధు డ్రాప్ షాట్లతో ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్ద 21 పాయింట్లు గెలుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సింధు... క్వాలిఫయర్ అకానే యమగుచి (జపాన్)తో తలపడుతుంది. -
పీవీ సింధుకు అర్జున అవార్డు
న్యూఢిల్లీ: క్రీడాకారులకు అత్యుత్తమ పురస్కారాలను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ షూటర్ రంజన్ సోధీకి క్రీడా రంగంలో అత్యున్నతమైనదిగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. క్రికెట్లో రాణిస్తున్న భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు, ఇటీవలి కాలంలో జింబాబ్వేతో ఆ దేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లికి అర్జున పురస్కారం లభించింది. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తూ, సుదీర్ఘ కాలం తర్వాత మన దేశానికి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్య పతకాన్ని అందించిన మన రాష్ట్ర క్రీడాకారిణి పి.వి సింధును కూడా అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. పుల్లెల గోపీచంద్ తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన సింగిల్స్ ప్లేయర్ పి.వి. సింధు మాత్రమేనన్న సంగతి తెలిసిందే. -
సైనాతో పోరుకు సిద్ధం: పి.వి.సింధు
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌తో పోరుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన పి.వి.సింధు తెలిపింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్)లో సైనాతో తలపడటానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నట్లు సింధు తెలిపింది. ఈ నెల 14 నుంచి ఐబీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన తమ మధ్య జరిగే మ్యాచ్‌లో సైనాను నిలువరించటానికి ప్రయత్నిస్తానని సింధు సవాల్ విసిరింది. ఐబీఎల్ లో రసవత్తర పోరు సాగడం ఖాయమని, అత్యుత్తమ క్రీడాకారిణులతో తలపడేందుకు ఎదురుచూస్తున్నానని సింధు తెలిపింది. అవాధీ జట్టుకు ఐకాన్ ప్లేయర్‌గా సింధు, హాట్ షాట్ ఐకాన్ ప్లేయర్‌గా సైనాలు బరిలోకి దిగుతున్నారు.