కెప్టెన్ల పోరులో... రోహిత్ జోరు | IPL 2016, KKR vs MI: Rohit Sharma, Jos Buttler make little of 188-run target by Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

కెప్టెన్ల పోరులో... రోహిత్ జోరు

Published Thu, Apr 14 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

కెప్టెన్ల పోరులో...   రోహిత్ జోరు

కెప్టెన్ల పోరులో... రోహిత్ జోరు

కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ విజయం
188 పరుగులను ఛేదించిన రోహిత్ బృందం
బట్లర్ మెరుపు ఇన్నింగ్స్

 

ఇటు గంభీర్, అటు రోహిత్... ఇద్దరు కెప్టెన్ల నాణ్యమైన, బాధ్యతాయుత ఇన్నింగ్స్. ఇటు రసెల్, అటు బట్లర్... ఇద్దరు విదేశీ హిట్టర్ల మెరుపులు. చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో సమ ఉజ్జీల సమరంలా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు పైచేయి సాధించింది. అవడానికి ఈడెన్ గంభీర్ జట్టుకు సొంతమైదానమే అయినా... ఇక్కడ అద్బుతమైన రికార్డు ఉన్న రోహిత్ శర్మ మరోసారి అదే జోరుతో ముంబైని గెలిపించాడు.
 
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో విజయాల బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో పుణే చేతిలో ఘోరంగా ఓడిన రోహిత్ సేన వేగంగా కోలుకుని కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యం కళ్లముందున్నా... రోహిత్ శర్మ (54 బంతుల్లో 84 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు... జాస్ బట్లర్ (22 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో... మరో ఐదు బంతులు మిగిలుం డగానే 6 వికెట్లతో గంభీర్ సేనను ఓడించింది.


ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్ (52 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్సర్) యాంకర్ పాత్ర పోషించి అర్ధసెంచరీ చేశాడు. మనీష్ పాండే (29 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధసెంచరీ చేయగా... రసెల్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

 అద్భుత భాగస్వామ్యం
కోల్‌కతా జట్టు ఈ మ్యాచ్‌కు నరైన్ అందుబాటులో ఉన్నా ఆశ్చర్యకరంగా తుది జట్టులోకి తీసుకోలేదు. ఓపెనర్లు ఉతప్ప, గంభీర్ ఆచితూచి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే మెక్లీనగన్ బౌలింగ్‌లో షార్ట్ బంతిని ఆడబోయి ఉతప్ప (8) అవుటయ్యాడు. ఈ దశలో గంభీర్, మనీష్ పాండే కలిసి అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతుల్ని బౌండరీలకు పంపుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 60 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గంభీర్ 39 బంతుల్లో, పాండే 26 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో హర్భజన్ టాప్ స్పిన్‌తో మనీష్ పాండేను అవుట్ చేశాడు. రసెల్ ఆడిన నాలుగో బంతికే సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో మూడు సిక్సర్లు కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. అయితే చివరి మూడు ఓవర్లలో ముంబై బౌలర్లు పుంజుకుని  పరుగులను నియంత్రించారు.


 మెరుపు ఆరంభం
లక్ష్య ఛేదనలో సిక్సర్‌తో ఖాతా తెరచిన రోహిత్ ఇన్నింగ్స్ ఆద్యంతం నిలకడగా ఆడాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన పార్థీవ్ పటేల్ కూడా జోరు కనబరిచాడు. అయితే పవర్ ప్లే చివర్లో లేని పరుగుకు వెళ్లి రనౌటయ్యాడు. పార్థీవ్, రోహిత్ తొలి వికెట్‌కు 35 బంతుల్లో 53 పరుగులు జోడించి ముంబైకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. హార్దిక్ పాండ్యా నిరాశపరిచినా... పించ్ హిట్టర్‌గా వచ్చిన మెక్లీనగన్ (8 బంతుల్లో 20; 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మరో ఎండ్‌లో కుదురుగా ఆడిన రోహిత్ 38 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. బట్లర్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

ముంబై విజయానికి చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు అవసరమైన దశలో... బట్లర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో విజయానికి 18 పరుగులు అవసరం కాగా..... రసెల్ బౌలింగ్‌లో బట్లర్ అవుటయ్యాడు. అయితే 19వ ఓవర్లోనే రోహిత్ నాలుగు ఫోర్లు కొట్టడంతో ముంబై విజయం ఖరారయింది.

 
స్కోరు వివరాలు: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పొలార్డ్ (బి) మెక్లీనగన్ 8; గంభీర్ (సి) పార్థీవ్ (బి) పాండ్యా 64; మనీష్ పాండే (సి) అండ్ (బి) హర్భజన్ 52; ఆండ్రీ రసెల్ (బి) మెక్లీనగన్ 36; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 9; మున్రో రనౌట్ 4; సూర్యకుమార్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1-21; 2-121; 3-164; 4-170; 5-183.

బౌలింగ్: సౌతీ 4-0-43-0; బుమ్రా 4-0-32-0; మెక్లీనగన్ 4-0-25-2; హార్దిక్ పాండ్యా 2-0-22-1; హర్భజన్ 4-0-31-1; సుచిత్ 2-0-31-0.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ నాటౌట్ 84; పార్థీవ్ పటేల్ రనౌట్ 23; హార్దిక్ పాండ్యా (సి) పాండే (బి) చావ్లా 9; మెక్లీనగన్ (సి) మున్రో (బి) కుల్‌దీప్ 20; బట్లర్ (సి) సూర్యకుమార్ (బి) రసెల్ 41; పొలార్డ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 188.

వికెట్ల పతనం: 1-53; 2-87; 3-109; 4-175.
బౌలింగ్: రసెల్ 4-0-52-1; హేస్టింగ్స్ 4-0-31-0; హాగ్ 4- 0-37-0; చావ్లా 3.1-0-29-1; కుల్‌దీప్ 4-0-37-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement