18 మ్యాచ్ లు.. 500 ఫోర్లు
న్యూఢిల్లీ: "కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్పా ఆడాలి' అన్నట్లు సాగతుంది ఐపీఎల్ పదో సీజన్. ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్ల మోత.. ధనాధన్ మెరుపులు. ఐపీఎల్ ఆడే ప్రతి బ్యాట్స్ మెన్ ఇక్కడ మెరవాలనే సంకల్పంతోనే బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలోనే ప్రతీ రోజు ఎన్నోరికార్డులు. తాజాగా సరికొత్త రికార్డు నమోదైంది.ఇప్పటివరకూ 18 మ్యాచ్ లు జరగ్గా 500 బౌండరీలు వచ్చి చేరాయి. సోమవారం ఢిల్లీ డేర్ డేవిల్స్, కొల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ 500వ ఫోర్ నమోదైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బ్యాట్స్ మన్ మనీశ్ పాండే క్రిస్ మోర్రిస్ బౌలింగ్ లో కొట్టిన బౌండరీనే 500వ ఫోర్ గా రికార్డులకెక్కింది.
ఇక అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కోల్ కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్ లు ఆడిన గౌతమ్ 30 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 26 ఫోర్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. అత్యధిక ఫోర్లు కొట్టిన జట్లలో కోల్ కతా 78 ఫోర్లతో ప్రథమ స్థానం, సన్ రైజర్స్ హైదరాబాద్ 74 ఫోర్లతో రెండో స్థానంలోఉన్నాయి. ఇక ఢిల్లీ డేర్ డేవిల్స్, రైజింగ్ పుణేలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. పదో సీజన్ లో ఇప్పటికి 19 మ్యాచ్ లు జరగగా 522 ఫోర్లు నమోదయ్యాయి. ఇప్పటికే 15 ఇన్నింగ్స్ ల్లోనే 100 సిక్స్ లు నమోదవ్వగా తాజాగా 500 ఫోర్లు నమోదవ్వడంతో అభిమానుల సంతోషంగా ఈ సీజన్ ను అస్వాదిస్తున్నారు. అత్యధిక సిక్సర్లు రాయల్ చాలెంజర్స్ కొట్టిన బ్యాట్స్ మన్ గా బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ (14) నిలిచాడు.