ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా అన్నే పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ప్రసీద్ కృష్ణ వేసిన ఓవర్‌లో రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ రబడా బౌలింగ్‌లో కేవలం 7 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్ రబడా తన సూపర్ బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్-కేకేఆర్ మ్యాచ్ టై అయింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి యువ సంచలనం పృథ్వీ షా(99; 55 బంతుల్లో 12ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన రీతిలో ఆడాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు. పృథ్వీకి తోడుగా సారథి శ్రేయాస్ అయ్యర్(43, 32 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు)కూడా రెచ్చిపోయాడు. షా, అయ్యర్‌లు ఆడినంత సేపు ఢిల్లీ సునాయసంగా విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే వీరిద్దరి నిష్క్రమణ తర్వాత మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగి విఫలమయ్యారు. పంత్(11), విహారీ(2), వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి ఆరు పరుగులు కావాల్సిన సమయంలో ఆజట్టు కేవలం ఐదు పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులే చేసింది. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ రెండు, ఫెర్గుసన్, చావ్లా, రసెల్‌లు తలో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ దిగింది. కేకేఆర్ బ్యాటింగ్‌ను నిఖిల్ నాయక్, క్రిస్ లిన్‌లు ఆరంభించారు. అయితే నిఖిల్ నాయక్(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి రాబిన్ ఊతప్ప(11) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. దినేశ్ కార్తీక్ సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, మిగతా టాపార్డర్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు. అయితే రసెల్ వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఓ దశలో రసెల్ ధాటికి బెంబెలేత్తిపోయిన ఢిల్లీ బౌలర్లు.. చివరకు అతని వికెట్ తీసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రసెల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62) ఔటయ్యాడు. అటు తర్వాత కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, రబడా, లామ్‌చెన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment