పాపం బెంగళూరు! | IPL 7: Faulkner, Smith steal a thriller for Rajasthan against RCB | Sakshi
Sakshi News home page

పాపం బెంగళూరు!

Published Mon, May 12 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

పాపం బెంగళూరు!

పాపం బెంగళూరు!

 రాజస్థాన్ సూపర్ ఛేజింగ్
 5 వికెట్లతో ఆర్‌సీబీ చిత్తు
 యువరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా
 రాయల్స్‌ను గెలిపించిన స్మిత్, ఫాల్క్‌నర్
 
 మ్యాచుకో కోటి రూపాయల భారాన్ని మోస్తూ వచ్చిన యువరాజ్ సింగ్ ఎట్టకేలకు తన విలువను ప్రదర్శించినా ఫలితం దక్కలేదు. భీకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లోనూ రాణించినా బెంగళూరు ఓటమి పాలైంది.భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువీ బౌలింగ్ ధాటికి చివరి 39 బంతుల్లో 85 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్థాన్ నిలిచింది.
 
 అయితే ఇదే మైదానంలో ఆసీస్ తరఫున ఆడి రికార్డు సెంచరీ సాధించిన ఫాల్క్‌నర్ ఈసారీ చిన్నస్వామి స్టేడియాన్ని సొంతం చేసుకున్నాడు. స్టీవెన్ స్మిత్‌తో కలిసి భారీ షాట్లతో చెలరేగి తమ జట్టును గెలిపించాడు. భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్థాన్‌కు అద్భుత విజయం దక్కగా...రాయల్ చాలెంజర్స్‌కు నిరాశే మిగిలింది.
 
 బెంగళూరు: యువరాజ్ చాన్నాళ్ల తరువాత అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా...అది బెంగళూరు విజయానికి సరిపోలేదు. భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన రాజస్థాన్ ప్రత్యర్థికి నిరాశను మిగిల్చింది. భారీస్కోరును సాధించినా దాన్ని కాపాడుకోవడంలో చాలెంజర్స్ విఫలమైంది.  ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్ తొలుత బ్యాట్‌తో (38 బంతుల్లో 83; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఆపై బంతితో (4/35) చెలరేగి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు.  డివిలియర్స్ (32 బంతుల్లో 58; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు.  అనంతరం రాజస్థాన్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కరుణ్ నాయర్ (39 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... చివర్లో స్టీవెన్ స్మిత్ (21 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (17 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో చెలరేగి కోహ్లి సేనను చిత్తు చేశారు. వీరిద్దరు చివరి 17 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం.  ఫాల్క్‌నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 యువీ వీరంగం...
 బెంగళూరు ఇన్నింగ్స్ నిరాశాజనక రీతిలో ఆరంభమైంది. పార్థివ్‌ను కాదని గేల్‌తో కలిసి స్వయంగా ఓపెనింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లి (4) పేలవఫామ్‌ను కొనసాగిస్తూ మూడో  ఓవర్లోనే ఔటయ్యాడు. ఈ క్రమంలో గేల్ మూడు, విజయ్ జోల్ రెండు చొప్పున ఫోర్లు కొట్టినా.. పవర్ ప్లే ముగిసేటప్పటికి బెంగళూరుకు వికెట్ నష్టానికి 31 పరుగులు మాత్రమే లభించాయి. అయితే డివిలియర్స్‌కు జత కలిసిన యువరాజ్ చాన్నాళ్ల తరువాత తన విశ్వరూపం ప్రదర్శించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు.
 
 తెవాటియా బౌలింగ్‌లో ఫోర్‌తో మొదలైన యువీ విజృంభణ.. ఆపై తీవ్రరూపం దాల్చి పరుగుల సునామీని సృష్టించింది. రజత్ భాటియా వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌తోపాటు మొత్తం 14 పరుగులు రాబట్టాడు. ఆపై తాంబే, రిచర్డ్‌సన్‌ల ఓవర్లలో మరో రెండు సిక్స్‌లతో 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. డివిలియర్స్ కూడా చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్‌లతో అర్ధసెంచరీ మైలురాయిని దాటాడు. యువీ, డివిలియర్స్‌ల విజృంభణతో చివరి 6 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు నమోదయ్యాయి.
 
 చివర్లో మెరుపులు...
 లక్ష్యఛేదనను రాజస్థాన్ దూకుడుగా ఆరంభించింది. రహానే, కరుణ్ నాయర్‌లు ప్రతి ఓవర్లోనూ కనీసం ఓ ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు నమోదయ్యాయి. అయితే రహానే (24)ను చహల్ ఔట్ చేశాక యువీ మాయ ప్రారంభమైంది. తన రెండో ఓవర్లో వాట్సన్ (1), బిన్నీ (1)లను, తరువాతి ఓవర్లో శామ్సన్ (13)ను వెనక్కి పంపాడు.
 
 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ఇక్కట్లలో పడినా.. మరోవైపు కరుణ్ నాయర్ దూకుడు మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నాయర్‌నూ యువరాజే ఔట్ చేశాడు.
 విజయానికి 36 బంతుల్లో 83 పరుగులు చేయాల్సివుండడంతో బెంగళూరు విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. కానీ, అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. స్టీవెన్ స్మిత్, ఫాల్క్‌నర్‌లు బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి దొరికిన బంతినల్లా బౌండరీ లైన్ దాటించారు.
 
 పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశారు.  స్టార్క్ వేసిన 17వ ఓవర్లో 21 పరుగులు, దిండా వేసిన 18వ ఓవర్లో 23 పరుగులు రాబట్టారు. దీంతో చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశకు మ్యాచ్ చేరింది. అయితే ఫాల్క్‌నర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించాడు.
 
 స్కోరు వివరాలు
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) భాటియా (బి) రిచర్డ్‌సన్ 4, గేల్ (సి) శామ్సన్ (బి) తాంబే 19, జోల్ (సి) వాట్సన్ (బి) తెవాటియా 16, డివిలియర్స్ (సి) రహానే (బి) ఫాల్క్‌నర్ 58, యువరాజ్ ఎల్బీడబ్ల్యూ (బి) రిచర్డ్‌సన్ 83, ఆల్బీ మోర్కెల్ (నాటౌట్) 1, పార్థివ్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 190.
 
 వికెట్ల పతనం: 1-6, 2-38, 3-40, 4-172, 5-186.
 బౌలింగ్: రిచర్డ్‌సన్ 4-0-43-2, వాట్సన్ 4-0-35-0, ఫాల్క్‌నర్ 4-0-42-1, తాంబే 4-0-38-1, తెవాటియా 3-0-17-1, భాటియా 1-0-13-0.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) పార్థివ్ (బి) చహల్ 24, కరుణ్ (బి) యువరాజ్ 56, వాట్సన్ (బి) యువరాజ్ 1, బిన్నీ (సి) సబ్-రోసో (బి) యువరాజ్ 1, శామ్సన్ (సి అండ్ బి) యువరాజ్ 13, స్మిత్ (నాటౌట్) 48, ఫాల్క్‌నర్ (నాటౌట్) 41, ఎక్స్‌ట్రాలు, 7, మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191.
 
 వికెట్ల పతనం: 1-54, 2-61, 3-63, 4-82, 5-106.
 బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-20-0, స్టార్క్ 3-0-33-0, దిండా 3-0-37-0, ఆరోన్ 2.5-0-41-0, యువరాజ్ 4-0-35-4, చహల్ 4-0-24-1.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement