బెంగళూరు ‘ఢమాల్’ | IPL 7: Royal Challengers Bangalore crash to big defeat against Rajasthan Royals | Sakshi
Sakshi News home page

బెంగళూరు ‘ఢమాల్’

Published Sun, Apr 27 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

బెంగళూరు ‘ఢమాల్’

బెంగళూరు ‘ఢమాల్’

70 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన
 రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
 ప్రవీణ్ తాంబే స్పిన్ మాయాజాలం
 
 ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన బ్యాటింగ్ లైనప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ది. దీనికి తగ్గట్లే మూడు మ్యాచ్‌ల పాటు చెలరేగిన స్టార్ ఆటగాళ్లు... అనూహ్యంగా నాలుగో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐపీఎల్‌లో తమ అత్యల్ప స్కోరు (70)కు ఆలౌటైన బెంగళూరు... రాజస్థాన్ చేతిలో ఓడింది.
 
 అబుదాబి: జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా.. క్రమశిక్షణతో, కలిసికట్టుగా ఆడితే ఎంతటి బలమైన జట్టునైనా మట్టి కరిపించవచ్చని రాజస్థాన్ రాయల్స్ మరోసారి నిరూపించింది. కోహ్లి, డివిలియర్స్, యువరాజ్ వంటి ‘కాస్ట్‌లీ’ ఆటగాళ్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అతి తక్కువ స్కోరుకే కుప్పకూల్చి అలవోక విజయం నమోదు చేసింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో దూకుడు ప్రదర్శించిన కోహ్లిసేన.. వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్‌ను ఓడించింది. తొలుత బెంగళూరు 15 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది.
 
 
 ఐపీఎల్‌లో బెంగళూరుకు ఇది అత్యల్ప స్కోరు కాగా, మొత్తంగా మూడో అత్యల్ప స్కోరు కావడం విశేషం. కెప్టెన్ కోహ్లి (21; 3 ఫోర్లు), స్టార్క్ (18; 2 ఫోర్లు), రాంపాల్ (13; 1 సిక్స్)లు మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు. అనంతరం రాజస్థాన్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే 71 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రహానే (19 బంతుల్లో 23; 4 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. రాజస్థాన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 
 తొలి ఓవర్ నుంచే..
 విధ్వంసక ఓపెనర్ గేల్ మరోసారి డగౌట్‌కే పరిమితం కాగా, బెంగళూరుకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. బిన్నీ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికే తకవాలే (0) వెనుదిరగ్గా, మరుసటి బంతికే పార్థివ్ (1) రనౌటయ్యాడు. ఆ వెంటనే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌తో యువరాజ్ (3) స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాతి బంతికే రిచర్డ్‌సన్.. డివిలియర్స్ (0)ను బౌల్డ్ చేయడంతో బెంగళూరు 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
 
 ఈ దశలో సచిన్ రాణాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఆరో ఓవర్లో రాణా (3) వాట్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లకు 22 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత తాంబే స్పిన్ మాయాజాలం మొదలైంది. కోహ్లి సహా నాలుగు వికెట్లు తీసిన తాంబే ఐపీఎల్‌లో తన ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
 
 రాయల్స్ అలవోకగా..
 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో రహానే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అయితే అ తరువాత కూడా అదే జోరు కొనసాగించిన రహానేను ఐదో ఓవర్లో స్టార్క్ ఔట్ చేశాడు. ఆపై వెంట వెంటనే శామ్సన్ (2) రనౌట్ కావడం, కరుణ్ నాయర్ (8)నూ స్టార్క్ వెనక్కి పంపడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. క్రీజులోకొచ్చిన కెప్టెన్ షేన్ వాట్సన్ కొద్దిసేపు జాగ్రత్తగా ఆడినా.. ఆ తరువాత రెండు సిక్స్‌లు బాది కోహ్లిసేనకు మరో అవకాశం లేకుండా చేశాడు.
 
 స్కోరు వివరాలు
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ రనౌట్ 1, తకవాలే (సి) శామ్సన్ (బి) బిన్నీ 0, విరాట్ కోహ్లి (సి) సౌతీ (బి) తాంబే 21, యువరాజ్ (సి) స్మిత్ (బి) రిచర్డ్‌సన్ 3, డివిలియర్స్ (బి) రిచర్డ్‌సన్ 0, రాణా (బి) వాట్సన్ 3, ఆల్బీ మోర్కెల్ (సి) స్మిత్ (బి) తాంబే 7, స్టార్క్ (సి) బిన్నీ (బి) భాటియా 18, రాంపాల్ (సి) సౌతీ (బి) తాంబే 13, దిండా ఎల్బీడబ్ల్యూ (బి) తాంబే 0, చహల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం: (15 ఓవర్లలో ఆలౌట్) 70.
 వికెట్ల పతనం: 1-1, 2-1, 3-5, 4-5, 5-17, 6-28, 7-46, 8-62, 9-70, 10-70.
 బౌలింగ్: బిన్నీ 1-0-1-1, సౌతీ 3-0-16-0, రిచర్డ్‌సన్ 4-0-18-2, వాట్సన్ 2-1-5-1, తాంబే 4-0-20-4, రజత్ భాటియా 1-0-7-1.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: అజింక్యా రహానే (సి) పార్థివ్  పటేల్ (బి) స్టార్క్ 23, కరుణ్ నాయర్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 8, శామ్సన్ రనౌట్ 2, అభిషేక్ నాయర్ నాటౌట్ 11, వాట్సన్ (సి) డివిలియర్స్ (బి) చహల్ 24, స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం: (13 ఓవర్లలో 4 వికెట్లకు) 71.
 
 వికెట్ల పతనం: 1-31, 2-35, 3-36, 4-68.
 బౌలింగ్: స్టార్క్ 4-0-29-2, రాంపాల్ 4-0-16-0, చహల్ 3-1-17-1, అశోక్ దిండా 2-0-8-0.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement