
హైదరాబాద్ ‘హ్యాట్రిక్’
సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో పరాజయం
ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం
7 వికెట్లతో కోల్‌కతా విజయం
రాణించిన ఉమేశ్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్
గత సీజన్‌లో సొంతగడ్డపై నిలకడగా రాణించిన సన్‌రైజర్స్‌కు ఈసారి ఉప్పల్ స్టేడియం అచ్చి రావడంలేదు. సమష్టి వైఫల్యంతో హైదరాబాద్ జట్టు ఈ మైదానంలో పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలుత బ్యాట్స్‌మెన్ రాణించకపోగా, ఆ తర్వాత బౌలర్లూ ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా ఏడో పరాజయంతో సన్‌రైజర్స్ జట్టు అవకాశాలు అస్తమించినట్లే! మరోవైపు గంభీర్ సేన మాత్రం తాజా విజయంతో ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది.
సాక్షి, హైదరాబాద్
ఐపీఎల్-7లో ప్లే ఆఫ్ చేరాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరేలా లేవు. జట్టు ఖాతాలో మరో ఓటమి చేరడం రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. ఆదివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), యూసుఫ్ పఠాన్ (28 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్ పాండే (32 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఉమేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
వార్నర్ ఒక్కడే...
సన్‌రైజర్స్‌కు ఈసారి శుభారంభం లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫించ్ (8) వెనుదిరగ్గా... ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) కూడా తొందరగానే అవుటయ్యాడు. పవర్ ప్లేలో జట్టు 2 వికెట్లకు 41 పరుగులు చేయగలిగింది.
9 పరుగుల వద్ద ఉతప్ప స్టంప్ మిస్ చేయడంతో బతికిపోయిన నమన్ ఓజా (24 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ (14) పెద్దగా ప్రభావం చూపలేదు.
మరోవైపు వార్నర్ మాత్రం దూకుడు ప్రదర్శించాడు. తనదైన శైలిలో భారీ సిక్సర్లతో పాటు కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఉమేశ్ బౌలింగ్‌లో వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది.
చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా పెద్దగా పరుగులు రాలేదు. స్యామీ (16 బంతుల్లో 7) బంతులు వృథా చేయగా, చివరి 5 ఓవర్లలో సన్ 33 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సమష్టి ప్రదర్శన...
కోల్‌కతా కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. స్టెయిన్ వేసిన రెండో ఓవర్లో అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో గంభీర్ (6) వెనుదిరిగాడు. రైజర్స్ చక్కటి బౌలింగ్, మెరుగైన ఫీల్డింగ్‌తో ఒత్తిడి పెంచడంతో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డ నైట్ రైడర్స్ పవర్ ప్లేలో కేవలం 30 పరుగులే చేయగలిగింది.
అయితే మనీశ్ పాండే అండతో ఉతప్ప ధాటిగా ఆడాడు. 9 పరుగుల వద్ద ధావన్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతను, ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అనవసరపు పరుగులు ప్రయత్నించి రనౌట్ కావడంలో ఉతప్ప ఇన్నింగ్స్ ముగిసింది.
పాండే కూడా చెలరేగి మిశ్రా వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టాడు. కొద్దిసేపటికే స్యామీ క్యాచ్ వదిలేసినా తర్వాతి బంతికే అతని ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ దశలో యూసుఫ్ పఠాన్ చాలా కాలం తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడగా... చివర్లో టెన్ డస్కటే (15 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి బ్యాటింగ్‌తో నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు. భువనేశ్వర్ వేసిన 18, 20 ఓవర్లలో కలిపి 27 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు విజయం సులువైంది.
గౌతముని ఆగ్రహం...
మైదానంలో అనుచిత ప్రదర్శనతో వివాదాల్లో నిలిచిన గంభీర్ కొన్నాళ్లుగా నియంత్రణలోనే ఉంటున్నాడు. కానీ ఆదివారం మ్యాచ్‌లో అతని కోపం పాత గంభీర్‌ను గుర్తుకు తెచ్చింది. స్టెయిన్ బౌలింగ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని ఒకే పరుగు చేసి అసహనంతో ఉన్న గౌతీ, ఆ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు.
వికెట్‌కు దూరంగా వెళుతున్న బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. అతని బ్యాట్‌కు బాల్ తగలకపోయినా స్వింగ్‌తో బంతి తన దిశ మార్చుకున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్ గంభీర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అంతే... అక్కడే బూతు పురాణం అందుకున్న గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డగౌట్ చేరే వరకు తిట్టుకుంటూనే వచ్చిన అతను బౌండరీ లైన్ బయటినుంచే బ్యాట్, గ్లవ్స్ విసిరేశాడు. కీలక మ్యాచ్‌లో ఇలా అవుట్ కావడంతో అతను పట్టరాని కోపం ప్రదర్శించాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) మోర్కెల్ (బి) ఉమేశ్ 8; ధావన్ (సి) గంభీర్ (బి) నరైన్ 19; నమన్ ఓజా (సి) యూసుఫ్ (బి) షకీబ్ 22; వార్నర్ (సి) యూసుఫ్ (బి) ఉమేశ్ 34; రాహుల్ (ఎల్బీ) (బి) చావ్లా 14; ఇర్ఫాన్ పఠాన్ (నాటౌట్) 23; స్యామీ (సి) పాండే (బి) షకీబ్ 7; కరణ్ శర్మ (రనౌట్) 4; స్టెయిన్ (బి) ఉమేశ్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-14; 2-41; 3-64; 4-98; 5-104; 6-129; 7-139; 8-142.
బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-39-0; ఉమేశ్ యాదవ్ 4-0-26-3; నరైన్ 4-0-21-1; షకీబ్ 3-0-22-2; డస్కటే 1-0-8-0; చావ్లా 4-0-24-1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 40; గంభీర్ (సి) ఓజా (బి) స్టెయిన్ 6; పాండే (సి) ఫించ్ (బి) కరణ్ 35; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 39; డస్కటే (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1-8; 2-59; 3-104.
బౌలింగ్: భువనేశ్వర్ 3.4-0-37-0; స్టెయిన్ 4-0-24-1; కరణ్ శర్మ 4-0-19-1; స్యామీ 1-0-7-0; మిశ్రా 4-0-38-0; ఇర్ఫాన్ 3-0-20-0.
కెప్టెన్‌గా స్యామీ...
ఐపీఎల్‌లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కావడంతో హైదరాబాద్ అప్పట్లో మరో మాటకు తావు లేకుండా శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే టోర్నీలో ఏ దశలోనూ శిఖర్ నాయకుడిగా తన ముద్ర చూపించలేకపోయాడు.
పైగా కీలక సమయాల్లో అనేక చెత్త, ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకొని తన వైఫల్యాన్ని బయటపెట్టాడు. దాంతో వెస్టిండీస్ జాతీయ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీని ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది కూడా సంగక్కర కెప్టెన్‌గా టోర్నీని ఆరంభించిన ఈ జట్టు సగం ముగిశాక కామెరాన్ వైట్‌కు బాధ్యతలు అప్పగించింది. ధావన్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు.
కెప్టెన్‌గా స్యామీ...
ఐపీఎల్‌లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కావడంతో హైదరాబాద్ అప్పట్లో మరో మాటకు తావు లేకుండా శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే టోర్నీలో ఏ దశలోనూ శిఖర్ నాయకుడిగా తన ముద్ర చూపించలేకపోయాడు. పైగా కీలక సమయాల్లో అనేక చెత్త, ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకొని తన వైఫల్యాన్ని బయటపెట్టాడు. దాంతో వెస్టిండీస్ జాతీయ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీని ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది కూడా సంగక్కర కెప్టెన్‌గా టోర్నీని ఆరంభించిన ఈ జట్టు సగం ముగిశాక కామెరాన్ వైట్‌కు బాధ్యతలు అప్పగించింది. ధావన్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు.
హైదరాబాద్ ఆనందించండి...
కామెంటరీలో రవిశాస్త్రి శైలే వేరు. ఆకాశం బద్దలయ్యేలా గొంతు చించుకొని మాట్లాడతారు. చేతిలో మైక్ ఉన్నా... దాని అవసరం లేనట్లే అరిచే ఆ గొంతు మైక్ లేకుండానే మైదానం అంతా వినిపించగలదు. ఆదివారం కూడా టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ప్రేక్షకులవైపు తిరిగారు. ‘హైదరాబాద్... ఆనందించండి’ అంటూ తెలుగులో పెద్దగా వేసిన కేకకు స్టేడియం అదిరిపోయింది. అభిమానులు కూడా దీటుగా స్పందించడంతో మైదానం హోరెత్తిపోయింది.