ఐపీఎల్-7లో బుధవారం దాకా ఎవరూ అంతగా పట్టించుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ముంబైతో జరిగిన మ్యాచ్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది
ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్య
దుబాయ్: ఐపీఎల్-7లో బుధవారం దాకా ఎవరూ అంతగా పట్టించుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ముంబైతో జరిగిన మ్యాచ్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ వీరవిహారం చేసి ముంబైని విజయానికి చేరువగా తీసుకెళ్లిన దశలో ఇర్ఫాన్ అద్భుత బౌలింగ్ (2/10)తో అతణ్ని ఔట్‌చేయడంతోపాటు హైదరాబాద్‌కు విజయాన్నందించిన సంగతి తెలిసిందే. అయితే జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన స్ఫూర్తే తన ప్రదర్శనకు కారణమని ఇర్ఫాన్ అంటున్నాడు.
‘మ్యాచ్‌కు ముందు లక్ష్మణ్ భాయ్‌తో మాట్లాడాను. మైదానం బయట మనం ఏం చేశామన్నది అవసరం లేదని, 22 గజాల స్థలంలో ఏ మేరకు చెలరేగామన్నదే ముఖ్యమని అతడు చెప్పాడు. అదే లెక్కలోకి వస్తుందన్న లక్ష్మణ్ వ్యాఖ్యలు నాలో స్ఫూర్తి నింపాయి’ అని ఇర్ఫాన్ అన్నాడు. తాజా ప్రదర్శన టోర్నీలో మన్ముందు మరింత బాగా రాణించేందుకు తోడ్పడగలదని చెప్పాడు. గత మ్యాచ్‌ల్లో ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడంతో ముంబైతో మ్యాచ్‌లోనూ అలాగే భావించానని, కానీ పొలార్డ్ విజృంభణ కారణంగా తనకు ఆ చాన్స్ దక్కిందని ఇర్ఫాన్ తెలిపాడు.
శిఖర్ ముందే చెప్పాడు
చివరి ఓవర్‌ను తానే వేయాల్సివుంటుందని కెప్టెన్ శిఖర్ ధావన్ మందుగానే చెప్పాడని, దాంతో ఎలాంటి బంతులేయాలో నిర్ణయించుకునే సమయం దక్కిందని ఇర్ఫాన్ తెలిపాడు. ‘18వ ఓవర్ స్టెయిన్ వేశాక శిఖర్ నా వద్దకు వచ్చి చివరి ఓవర్ వేయాల్సివుంటుందని చెప్పాడు. తగిన సమయం చిక్కడంతో ఎలాంటి బంతులేయాలన్నది నిర్ణయించుకోగలిగాను. అదృష్టం కొద్దీ అనుకున్న చోటే బంతులు పడ్డాయి’ అని అన్నాడు. అయితే తొలి బంతికే పొలార్డ్‌ను ఔట్ చేసినా, మ్యాచ్ ఇంకా ముగియలేదన్న స్పష్టమైన అవగాహనతోనే చివరిదాకా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశానన్నాడు.