‘చుక్క’ల పల్లకిలో... | IPL broadcast rights winner Star India | Sakshi
Sakshi News home page

‘చుక్క’ల పల్లకిలో...

Published Tue, Sep 5 2017 12:16 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

‘చుక్క’ల పల్లకిలో...

‘చుక్క’ల పల్లకిలో...

ఐపీఎల్‌ ప్రసార హక్కుల విజేత స్టార్‌ ఇండియా
రూ. 16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం
గతంతో పోలిస్తే 158 రెట్లు పెరిగిన హక్కుల విలువ
2018 నుంచి 2022 వరకు ఒప్పందం   


ధనాధన్‌ క్రికెట్‌ చూపించిన ధమాకా ఇది... పొట్టి ఆట ప్రదర్శించిన విశ్వరూపం ఇది... 20–20తో ప్రపంచ క్రికెట్‌ దశ, దిశను మార్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రతిష్ట చుక్కలనంటిన విలువ ఇది... ప్రతిభావంతులకు తగిన గుర్తింపునిచ్చే వేదికగా 2008లో ముందుకు వచ్చిన ఈ లీగ్‌ ఇన్నేళ్లలో ఆదరణలో, ఆదాయంలో తారా పథానికి చేరింది. ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఒప్పందంతో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోని ఇతర ప్రఖ్యాత లీగ్‌లతో పోటీ పడేలా మన ఐపీఎల్‌  సగర్వంగా నిలిచింది.
ఒక్కో మ్యాచ్‌కు రూ. 54.49 కోట్లు... ఏడాదికి రూ. 3269.50 కోట్లు... ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు బీసీసీఐకి స్టార్‌ ఇండియా చెల్లించనున్న మొత్తం ఇది! భారత జట్టు ఆడుతున్న ఒక్కో మ్యాచ్‌తో పోలిస్తే కూడా ఇది చాలా ఎక్కువ. సొంతగడ్డపై టీమిండియా మ్యాచ్‌లు, ఐసీసీ టోర్నీలు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్‌లు... ఇలా సింహభాగం క్రికెట్‌ కవరేజీని ఇప్పటి వరకు తమ గుప్పిట్లో ఉంచుకున్న స్టార్‌కు ఐపీఎల్‌ మాత్రమే లోటుగా ఉండిపోయింది. ఇప్పుడు దానిని కూడా సొంతం చేసుకొని వన్‌ ఛానల్‌ షోగా మార్చేసింది.


ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పంట పండింది. వచ్చే ఐదేళ్ల కాలానికి అనూహ్య మొత్తానికి టెలివిజన్, డిజిటల్‌ రైట్స్‌ అమ్ముడుపోయాయి. రూ. 16 వేల 347.50 కోట్ల (2.55 బిలియన్‌ డాలర్లు) భారీ మొత్తానికి స్టార్‌ ఇండియా సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. సోమవారం నిర్వహించిన వేలంలో నిబంధనల ప్రకారం సీల్డ్‌ కవర్‌లో అత్యధిక బిడ్‌ వేసిన గ్రూప్‌నకు బీసీసీఐ హక్కులను కేటాయించింది. ఉపఖండంలో టెలివిజన్‌ హక్కుల కోసం స్టార్‌తో పోటీ పడిన సోనీ సంస్థ ఈసారి అవకాశం కోల్పోయింది. కొత్త ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్‌కు ఈ హక్కులు చెందుతాయి. 2008లో తొలి ఐపీఎల్‌ సమయంలో పదేళ్ల కాలానికి హక్కులను వరల్డ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ 918 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 8,200 కోట్లు) సొంతం చేసుకొని... మరుసటి ఏడాది తొమ్మిదేళ్ల కోసం సోనీ గ్రూప్‌నకు 1.63 బిలియన్‌ డాలర్లకు అమ్మేసింది.

2015లో మూడేళ్ల కాలానికి డిజిటల్‌ హక్కులు 302.2 కోట్లకు అమ్ముడుపోయాయి. టెలివిజన్‌ ప్రేక్షకులతో పాటు ఇంటర్‌నెట్, మొబైల్‌లలో కూడా వీక్షకుల ఆదరణ పెరగడంతో ఈసారి రెండింటిలో బీసీసీఐ భారీ మొత్తాన్ని ఆశించింది. దానికి తగినట్లుగా ఈ రెండూ కలిపి చూస్తే తాజాగా దక్కిన మొత్తం ఏకంగా 158 రెట్లు ఎక్కువ కావడం విశేషం! మైదానం బయటి వ్యవహారాలు, వివాదాలు, కోర్టు గొడవలులాంటివి ఐపీఎల్‌కు ఉన్న ఆదరణపై ఎలాంటి ప్రభావం చూపించలేదనేది ఈ దెబ్బతో మళ్లీ రుజువైంది.  

సోనీ చేజారిందిలా...
మొత్తం ఏడు కేటగిరీల్లో ఐపీఎల్‌ హక్కుల కోసం బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానించింది. భారత ఉపఖండంలో టెలివిజన్, భారత ఉపఖండంలో డిజిటల్‌ హక్కులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన మరో ఐదు కేటగిరీల (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెస్టాఫ్‌ వరల్డ్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా) కోసం కూడా వేర్వేరుగా హక్కులను అందుబాటులో ఉంచారు.  భారత్‌లో టీవీ హక్కుల కోసం స్టార్‌ రూ. 6,196.94 కోట్లతో బిడ్‌ వేసింది. దీనికంటే చాలా ఎక్కువగా సోనీ రూ. 11,050 కోట్లతో బిడ్‌ చేసి ముందంజలో నిలిచింది. అయితే డిజిటల్‌ హక్కుల కోసం రూ. 1,443 కోట్లతో పాటు మిగతా ఐదు కేటగిరీలకు కూడా స్టార్‌ బిడ్‌ వేయగా... సోనీ మాత్రం మరే ఇతర కేటగిరీలోకి అడుగే పెట్టలేదు. నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలకు కలిపి వేసే ‘గ్లోబల్‌ బిడ్‌’ మొత్తం, విడివిడిగా వేసే ఏ కేటగిరీ బిడ్‌కంటే ఎక్కువగా ఉన్నా... ఓవరాల్‌గా గ్లోబల్‌ బిడ్‌కే హక్కులు కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో దూసుకు వచ్చిన స్టార్‌ తమ పంతం నెగ్గించుకుంది. మొత్తం 24 కంపెనీలు బిడ్‌ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసినా... చివరకు 14 కంపెనీలే వేలంలో పాల్గొన్నాయి.   

రూ. 12 కోట్లు ఎక్కువ...
2017 ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు జరిగాయి. వచ్చే ఐదేళ్లలో కూడా జట్ల సంఖ్య, మ్యాచ్‌లలో మార్పులు లేకుండా ఇదే కొనసాగితే తాజా హక్కుల ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు స్టార్‌ సంస్థ రూ. 54.49 కోట్లు చెల్లించనుంది. భారత్‌ ఆడే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు సంబంధించి ప్రస్తుతం స్టార్‌ రూ. 43 కోట్లు (2012లో ఈ ఒప్పందం జరిగింది) చెల్లిస్తోంది. దీంతో పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌కు రూ. 12 కోట్లు అదనంగా వస్తున్నట్లు లెక్క. 2008లో ఐపీఎల్‌ కొత్తగా రావడంతో హక్కులను పదేళ్ల కాలానికి ఇచ్చారు. ఇప్పుడు దానికి సొంత గుర్తింపు ఉండటంతో పాటు ఒకే సారి పదేళ్ల కాలానికి ఇచ్చేస్తే తమకు నష్టదాయకమని బీసీసీఐ భావించింది. అందుకే ఈ సారి హక్కులను ఐదేళ్లకే పరిమితం చేశారు.

ఐపీఎల్‌ చాలా విలువైన ఆస్తి. 2008లో లీగ్‌ ప్రారంభమైన నాటినుంచి భారత్‌లో క్రికెట్‌ స్వరూపమే మారిపోయింది. ఈ బిడ్‌ దాని విలువను చూపిస్తోంది. బీసీసీఐకి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉన్నా... ఇప్పటికీ భారత్‌లో క్రికెట్‌ చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఏదో ఒకటి కాకుండా గెలిస్తే అన్ని హక్కులు మేమే గెలవాలి లేదంటే లేదు అని పట్టుదలతో బరిలోకి దిగాము. మేం చెల్లిస్తోంది మరీ భారీ మొత్తం కాదు. క్రికెట్‌ అభిమానులపై నమ్మకంతోనే మేం దీనికి సిద్ధమయ్యాం. మార్కెట్‌ విలువను బట్టి చూస్తే ఇది సరైన నిర్ణయమే. ఐపీఎల్‌ ద్వారా ఇప్పుడు అభిమానులకు మేం మరింత చేరువవుతాం.
– ఉదయ్‌శంకర్, స్టార్‌ సీఈఓ 



బీసీసీఐ కోశాధికారి అనిరుద్‌ చౌదరీ, అధ్యక్షుడు సీకే ఖన్నా, పరిపాలకుల కమిటీ సభ్యురాలు డయానాఎడుల్జీ, స్టార్‌ సీఈఓ ఉదయ్‌ శంకర్, బీసీసీఐ సెక్రటరీ అమితాబ్‌ చౌదరీ, సీఈఓ జోహ్రి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement