ఐపీఎల్ నిర్వహణకు అడ్మినిస్ట్రేటర్లు
ఇద్దరిని నియమించిన హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) మ్యాచ్‌లను అడ్మినిస్ట్రేటర్స్ పర్యవేక్షణలోనే నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశించింది. బీసీసీఐ సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలను అడ్మినిస్ట్రేటర్స్‌గా నియమించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సంఘాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలంటూ బీసీసీఐ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
హెచ్‌సీఏలో లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడం కూడా అడ్మినిస్ట్రేటర్స్ నియమించడానికి కారణమని తెలిపింది. ‘‘హెచ్‌సీఏలో సరఫరాదారులు, సిబ్బందికి బకాయిలు చెల్లింపు బాధ్యత అడ్మినిస్ట్రేటర్స్‌దే. వాస్తవాలను పరిశీలించిన తర్వాతే బ్యాంకులో ఉన్న నగదు నిల్వల ఆధారంగా చెల్లింపులు చేయాలి. అవసరమనుకుంటే ఉత్తర్వుల సవరణకు తమను ఆశ్రయించవచ్చు. అడ్మినిస్ట్రేటర్స్ రవాణా ఖర్చులను హెచ్‌సీఏ చెల్లించాలి. ఇద్దరు అడ్మినిస్ట్రేటర్స్ బీసీసీఐని సంప్రదించి ఆర్థిక సలహాదారులను నియమించుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌ల ఖాతాల నిర్వహణ బాధ్యత ఆర్థిక సలహాదారులే చూడాలి. హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్‌లు చూసేందుకు అవకాశం కల్పించండి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.