ఐపీఎల్ ప్రేక్షకులు (ఫైల్ ఫొటో)
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11 సీజన్‌లో ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సమయం కంటే ఓ గంట ముందుగానే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అభిమానుల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం మీడియాకు తెలిపారు.
‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టీవీ, మైదానాల్లో చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను ఓ గంట ముందు ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం మైదానంలోని అభిమానుల కోసమే కాకుండా టీవీ ప్రేక్షకులను సైతం దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. మ్యాచ్‌లు ఆలస్యం కావడంతో మైదాన, టీవీ ప్రేక్షకులకు ఉదయం లేచి, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. దీంతో మ్యాచ్ సమయాలను మార్చాం’ అని శుక్లా పేర్కొన్నాడు.
ప్రస్తుతం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లు రాత్రి 11.30 ముగుస్తున్నాయి. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అర్థరాత్రి 12 తర్వాత ముగుస్తున్నాయి. వర్షం అంతరాయం కలిగిస్తే ఇక అంతే సంగతులు. దీంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment