డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ (ఫైల్ ఫొటో)
ముంబై : ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. ఇప్పటికే వారి దేశ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించగా.. ఈ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్లు కెప్టెన్సీ నుంచి తప్పించాయి. కెప్టెన్సీ ఊడినా ఐపీఎల్‌లో ఆడొచ్చు అని భావించిన ఈ ఆటగాళ్లకు ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా గట్టి షాకిచ్చారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో స్మిత్, వార్నర్‌లను ఈ సీజన్ ఐపీఎల్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేశాడు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వార్నర్, స్మిత్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను తీసుకోవాలని సూచించారు. ఈ ఇద్దరిని ఈ సీజన్ ఐపీఎల్‌లోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్సీ నుంచి తొలిగించినా ఆటగాడిగానైనా జట్టులో కొనసాగుతారని అందరు భావించారు. తాజా నిర్ణయంతో ఈ ఫ్రాంచైజీలు వారిని భర్తీ చేయగల విదేశీ ఆటగాళ్ల అన్వేషణలో పడ్డాయి. డేవిడ్ వార్నర్ దూరమవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సగం బలం కోల్పోనుంది.
ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ బాధ్యతను గత రెండు సీజన్లలో వార్నర్ ఒంటి చేత్తో భుజాన మోసాడు. దీంతోనే సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్‌ను వదులుకోకుండా అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని తలపట్టుకుంటున్న సన్‌రైజర్స్ యాజమాన్యానికి తాజా నిర్ణయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు హైదరాబాద్ జట్టుకు ఇప్పటికిప్పుడు దొరకడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment