న్యూఢిల్లీ: ఇప్పటికే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు దూరంగా ఉంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆ దేశంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లకు సైతం బీసీసీఐ అల్టిమేటం జారీ చేసే యోచనలో ఉంది. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లను ఐపీఎల్ నుంచి నిషేధించేందుకు కసరత్తులు చేస్తోంది. జాతీయ వార్తాసంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం మేరకు పీఎస్‌ఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఒకవేళ ఐపీఎల్ కావాలనుకుంటే పీఎస్‌ఎల్‌లో ఆడకూడదనే ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది. ఆ రెండు లీగ్‌ల్లో ఏది కావాలో ఆయా క్రికెటర్లు తేల్చుకోవాలని తేల్చిచెప‍్పేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) సభ్యులు వినోద్ రాయ్, ఎడ్జుల్డీ, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రిల మధ్య జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే ఇప‍్పటికే పీఎస్‌ఎల్, ఐపీఎల్ ఆడుతున్న స్టార్ క్రికెటర్లు డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, ఏబీ డివిలియర్స్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదొక లీగ్ మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ ప్రతిపాదన చేస్తే మాత్రం సదరు క్రికెటర్లకు కొత్త చిక్కు వచ్చిపడినట్లే.
Comments
Please login to add a commentAdd a comment