
న్యూఢిల్లీ:గతేడాది భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ టెస్టులో భాగంగా యో-యో టెస్టును బీసీసీఐ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో యో-యో ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లకు సదరు పరీక్షలు నిర్వహించగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఇదే బాటలో పయనించడానికి కసరత్తులు చేస్తున్నాయి.
భారత జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాడు తిరిగి జట్టులోకి పునరాగమం చేయాలనుకుంటే యో-యో టెస్టు పాసవడం తప్పనిసరిగా చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ఈ నియమం తీసుకురాగా.. జట్టు ప్రదర్శన మెరుగవడంతో కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ టెస్టుని తమ ఆటగాళ్లకీ కూడా నిర్వహించాలని ఐపీఎల్‌లోని ఎనిమిది జట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు జట్లు ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టగా మిగతా జట‍్లు కూడా దీన్ని అమలు పరిచేందుకు ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు నిర్వహించిన యో యో టెస్టులో ప్రతీ లెవల్‌ను పూర్తి చేయడానికి 14.5 సెకండ్లు సమయం పట్టింది. దీన్ని లెవల్-5 నుంచి మొదలు పెట్టిన ముంబై ఇండియన్స్ దాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది.