ఇరగదీసిన ఇషాంత్ శర్మ
లండన్: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని పేసర్ ఇషాంత్ శర్మ నిలుపుకున్నాడు. తానెంత విలువైన ఆటగాడినో తెలియజెప్పాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఏకంగా ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సరైన సమయంలో విజృభించి తనలో సత్తా తగ్గలేదని రుజువు చేశాడు. కెరీర్ లో ఉత్తమ గణంకాలు నమోదు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కూడా అందుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీయకపోవడంతో అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. 24 ఓవర్లు వేసినా ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మరోపక్క యువ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ల వేటలో దూసుకెళుతుండడంతో 'లంబూ' ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈ సిరీస్ లో బ్యాటింగ్ లోనూ దుమ్ము దులిపిన భువీ.. శభాష్ అనిపించుకున్నాడు. దీంతో సీనియర్ బౌలరైన ఇషాంత్ పై ఒత్తిడి పెరిగింది.
ఇక వికెట్లు తీయలేక సతమవుతున్న ఇషాంత్ కీలక సమయంలో జూలు విధిల్చాడు. కుక్, బెల్, రూట్, ప్రయర్ లాంటి ప్రధాన బ్యాట్స్మెన్ కు కళ్లెం వేసి జట్టుకు విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత ఒంటి చేత్తో గెలుపు సాధించిపెట్టాడు. అంతేకాదు ఈ ప్రదర్శనతో లార్డ్స్ హానర్స్ బోర్డులోకి చేరాడు. ఒకే టెస్టులో ఇద్దరు భారత బౌలర్లు ఈ ఘనత సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసినన భువనేశ్వర్ కుమార్ పేరు హానర్స్ బోర్డులో తన పేరు లిఖించుకున్నాడు. విదేశీ గడ్డపై భారత పేసర్లు పూర్తి ఆధిపత్యం కనబరచడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం.