
టీమిండియాను వేధిస్తున్న అయిదు సమస్యలు
ఇంగ్లండ్ - ఇండియా మధ్య గురువారం జరుగబోయే వన్డే కీలకం కానున్నది. ఇరు జట్లు నేరుగా ఎదురుదాడి చేయడం తప్ప వేరే మార్గం లేదు.
హొబర్ట్ : ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లండ్ - ఇండియా మధ్య శుక్రవారం జరుగబోయే వన్డే కీలకం కానున్నది. ఇరు జట్లు నేరుగా ఎదురుదాడి చేయడం తప్ప వేరే మార్గం లేదు. గెలవడం.. ఫైనల్ చేరటం.. ఆస్ట్రేలియాతో తలపడటం. ఇప్పటికే తొలి మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ బోనస్ విజయంతో ఐదు పాయింట్లు సాధించింది. భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. మూడో వన్డేలో వరుణుడి పుణ్యమా అంటూ రెండు పాయింట్లు వచ్చాయి. ఆసీస్ మూడు వరుస విజయాలతో ఫైనల్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకుంది.
ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను ఐదు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. అవి:
1.ఓపెనింగ్ సమస్య..
తన పేలవమైన ఆటతీరుతో శిఖర్ ధావన్ టీమిండియాకు తలనొప్పిగా మారాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ, అతడిని గాయాలు వదలట్లేదు. ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన రహానె చక్కటి ప్రతిభ కనబరుస్తున్నా మరో ఎండ్లో శిఖర్ ధావన్ విఫలమవుతుండటం తెలిసిందే. గురువారం జరిగే మ్యాచ్లోనైనా ధావన్ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి. ఈ సిరీస్లో ధావన్ చేసిన స్కోర్లు 2,1,8..అంటే ఎంత పేలవ ఫామ్ కనబరుస్తున్నాడో ఈ అంకెలను చూస్తే అర్థం అవుతుంది.
2.కోహ్లి స్థానం ఎంత ?
కెప్టెన్ ధోని చేస్తున్న ప్రయోగాలకు బలవుతున్న ఆటగాదు కోహ్లి. అతడి మూడో నంబరులో దిగుతాడా ? లేక నాలుగో నంబరులో బ్యాటింగు చేస్తాడా ? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ యువ ఆటగాడు నాలుగో నంబరులో బ్యాటింగు చేసి వరుసగా 9,4, 3.. స్కోర్లు చేశాడు. కెప్టెన్ ధోని జరుగబోయే వన్డేలో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి.
3.బౌలింగ్ విషయానికొస్తే..
కెప్టెన్ ధోనికి పేసర్ల కంటే స్పిన్నర్ల మీదే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. వరల్డ్ కప్ జట్టులో ఎక్కువమంది ఆల్రౌండర్లే ఉన్నారు. వారిలో స్టూవర్ట్ బిన్నీ ఇప్పటికే తన ఆల్రౌండ్ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు కూడా బాగానే రాణిస్తున్నారనే చెప్పాలి. కానీ పేసర్లు ఎవరెవరు ఉంటారనే దానిపై ఇంకా సరైన అవగాహన లేదు.
4.గాయాల బెడద..
టీమిండియాకు మరో పక్క గాయాల బెడద కూడా ఉంది. మంచి ఫామ్లో ఉన్న రోహిత్ను గాయాలు వెంటాడుతున్నాయి. వరల్డ్ కప్లో చోటు దక్కించుకున్న జడేజా, ఇషాంత్, భువనేశ్వర్లు కూడా బెడ్ మీదనే ఉన్నారు.
5.అలసట..
మరో సమస్య ఏంటంటే అలసట లేకుండా మ్యాచ్లు ఆడటం. 1992లో ఇదే తరహాలో ప్రపంచకప్ బరిలో దిగింది భారత్. తరువాత మళ్లీ 2015 ఫిబ్రవరిలో కూడా గ్యాప్ లేకుండా టోర్నీలు ఆడి నేరుగా వరల్డ్ కప్ ఆడబోతోంది.
ఈ సమస్యలను అధిగమించి భారత్ ఈ సారి ఏం విచిత్రం చేయబోతోందో చూడాలంటే వేచి ఉండాల్సిందే.