
అదొక గొప్ప ఘనత: సాహా
భారత టెస్టు క్రికెట్ జట్టు నుంచి మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు తీసుకున్న తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న ఆటగాడు వృద్ధిమాన్ సాహా.
హైదరాబాద్:భారత టెస్టు క్రికెట్ జట్టు నుంచి మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు తీసుకున్న తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న ఆటగాడు వృద్ధిమాన్ సాహా. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ కీపర్ గా ఉన్న సాహా.. ఇప్పటివరకూ తాను ఆడిన టెస్టు మ్యాచ్లను ఒక మైలురాయిగా అభివర్ణించాడు. ఏ క్రికెటరైనా భారత తరపున 20కి పైగా టెస్టు మ్యాచ్లు ఆడటం అంటే అదొక అద్భుతమైన ఘనతేనని పేర్కొన్నాడు. 'టీమిండియా తరపున 20 నుంచి 22 టెస్టు మ్యాచ్లు ఆడటం అతి పెద్ద మైలురాయి. అది నాకే కాదు.. ఎవరికైనా గొప్ప ఘనతే' అని సాహా తెలిపాడు.
బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్ ద్వారా సాహా 21వ టెస్టు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన సాహా.. తన బ్యాటింగ్ పై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో తనను ఎక్కువగా స్టైట్ బ్యాట్ ఆడమనే సలహా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్దేనని సాహా పేర్కొన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఆడేటప్పుడు తన సహజసిద్ధమైన ఆటను ఆడే వీలు ఎక్కువగా ఉంటుందన్నాడు.