
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్‌లో పోరాట పటిమకు మారుపేరుగా నిలిచిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ యానా నొవోత్నా ఆదివారం కన్ను మూసింది. 49 ఏళ్ల నొవోత్నా కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన నొవోత్నా... సింగిల్స్‌లో రెండో ర్యాంక్‌ను సాధించింది. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) చేతిలో, 1997లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) చేతిలో వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయిన నొవోత్నా... 1998లో నటాలీ తౌజియట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఎట్టకేలకు తన వింబుల్డన్ టైటిల్ స్వప్నాన్ని సాకారం చేసుకుంది.
1987 నుంచి 1999 వరకు సాగిన తన కెరీర్ మొత్తంలో నొవాత్నా 24 సింగిల్స్, 76 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (సింగిల్స్‌లో ఒకటి, మహిళల డబుల్స్‌లో 12, మిక్స్‌డ్ డబుల్స్‌లో 4) ఉన్నాయి. 1988 సియోల్, 1996 అట్లాంటా ఒలింపిక్స్ డబుల్స్‌లో రజతాలు నెగ్గిన ఆమె అట్లాంటా ఒలింపిక్స్‌లోనే సింగిల్స్‌లో కాంస్యం సాధించింది.