
చెలరేగిన జాసన్ రాయ్
306 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఊదిపారేసింది. ఓపెనర్ జాసన్ రాయ్(162;118 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఆటకు, జో రూట్(65;54 బంతుల్లో 9ఫోర్లు) సమయోచిత బ్యాటింగ్ తోడు కావడంతో శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
లండన్: 306 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఊదిపారేసింది. ఓపెనర్ జాసన్ రాయ్(162;118 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఆటకు, జో రూట్(65;54 బంతుల్లో 9ఫోర్లు) సమయోచిత బ్యాటింగ్ తోడు కావడంతో శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన నాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ కు దిగిన లంకేయులు నిర్ణీత 42.0ఓవర్లలో 305 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. శ్రీలంక ఆటగాళ్లలో గుణ తిలక(62),కుశాల్ మెండిస్(77), చండిమల్(63), కెప్టెన్ మాథ్యూస్(67 నాటౌట్)లు రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ మొయిన్ అలీ(2) వికెట్ను కోల్పోయింది.
ఆ తరుణంలో మరో ఓపెనర్ జాసన్ రాయ్-జో రూట్ జోడి లంక బౌలర్లపై విరుచుకుపడింది. ఈ జోడీ రెండో వికెట్కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం రూట్ పెవిలియన్ చేరాడు. అయితే జాసన్ రాయ్ 74 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అతనికి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(22) సహకారం అందించడంతో ఇంగ్లండ్ 30.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అదే క్రమంలో భారీ శతకాన్ని నమోదు చేసిన రాయ్ ఇంగ్లండ్ స్కోరు 281 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో బెయిర్ స్టో(29నాటౌట్), బట్లర్(17 నాటౌట్) బాధ్యాతయుతంగా ఆడి ఇంగ్లండ్ను ఇంకా 11 బంతులుండగానే విజయానికి చేర్చారు. దీంతో ఇంగ్లండ్ సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డే టై కాగా, రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో వన్డే వర్షం వల్ల రద్దయ్యింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కల్గించడంతో 42.0 ఓవర్లకు కుదించారు.