
సూపర్ రాయ్
జాసన్ రాయ్ (118 బంతుల్లో 162; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ జట్టు శ్రీలంకపై 305 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
* నాలుగో వన్డేలో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం
* 2-0తో సిరీస్ కైవసం
లండన్: జాసన్ రాయ్ (118 బంతుల్లో 162; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ జట్టు శ్రీలంకపై 305 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్లతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) గెలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో... తొలుత లంక 5 వికెట్లకు 305 పరుగుల భారీస్కోరు సాధించింది. గుణతిలక (62), మెండిస్ (77), చండిమల్ (63), మాథ్యూస్ (67) అర్ధశతకాలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో విల్లీ, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 42 ఓవర్లలో 308 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ జట్టు 40.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 309 పరుగులు చేసి గెలిచింది. రాయ్‌తో పాటు రూట్ (54 బంతుల్లో 65; 9 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్‌కు వన్డేల్లో ఇది రెండో అత్యుత్తమ లక్ష్యఛేదన. ఈ మ్యాచ్‌లో 162 పరుగులు చేయడం ద్వారా జాసన్ రాయ్ ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఈ రికార్డు రాబిన్ స్మిత్ (167 నాటౌట్) పేరిట ఉంది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0తో గెలుచుకుంది. ఒకవన్డే టై కాగా, మరో వన్డే రద్దయింది. సిరీస్‌లో చివరి వన్డే శనివారం జరుగుతుంది.