ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
బ్రిస్టల్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి పైచేయి సాధించాలని భావిస్తోంది. మరోవైపు రెండో వన్డేలో ఘోర పరాజయన్ని ఎదుర్కొన్న లంకేయులు బోణీ చేయాలని భావిస్తున్నారు. తొలి వన్డేలో శ్రీలంక భారీ స్కోరు చేసిన ఆ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో గెలుపు కోసం మాథ్యూస్ సేన ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉండగా రెండో వన్డేలో ఇంగ్లండ్ రికార్డు విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.255 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించి కొత్త రికార్డు నమోదు చేసింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్(133 నాటౌట్;110 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్సర్లు), జాసన్ రాయ్(112 నాటౌట్;95 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఇంగ్లండ్కు పది వికెట్ల విజయాన్ని అందించారు. తద్వారా వన్డేల్లో వికెట్ కోల్పోకుండా 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నమోదు చేశారు. దీంతో అంతకుముందు వన్డేల్లో న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా ఛేదించిన రికార్డు తెరమరుగైంది. అలాగే ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతం (2010)లో స్ట్రాస్, ట్రాట్ రెండో వికెట్‌కు 250 పరుగులు జోడించారు.