
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా అంతే వేగంగా దూసుకొస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఏడో స్థానానికి ఎగబాకాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను సాధించిన బుమ్రా తన ర్యాంకును కూడా మరింత మెరుగుపరుచుకున్నాడు. ఒకేసారి తొమ్మిదిస్థానాలు ఎగబాకి టాప్-10లో వచ్చాడు. అంతకుముందు బుమ్రా అత్యుత్తమ టెస్టు ర్యాంకు 15 కాగా, ఆ తర్వాత ఒక స్థానం పడిపోయాడు.
కాగా, విండీస్‌పై అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో కూడా పట్టునిలుపుకున్నాడు. 774 రేటింగ్ పాయింట్లతో ఏడోస్థానాన్ని ఆక్రమించాడు. అయితే బుమ్రా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. ఇక మహ్మద్ షమీ 19వ స్థానంలో ఇషాంత్ శర్మ 21 స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంచితే, టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం 910 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 904 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో 81, 102 పరుగులతో రాణించిన అజింక్యా రహానే 11వ స్థానంలో నిలిచాడు. విండీస్‌పై ప్రదర్శన ఆధారంగా 21వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment