జయంత్ యాదవ్ రికార్డు
ముంబై: ఇంగ్లండ్తో నాల్గో టెస్టులో భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా తొలి టెస్టు సెంచరీ సాధించిన జయంత్ యాదవ్.. తొమ్మిదో వికెట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.భారత క్రికెట్ చరిత్రలో తొమ్మిది వికెట్గా వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇది జయంత్ యాదవ్ కు మూడో టెస్టు మ్యాచ్.
విశాఖలో జరిగిన రెండో టెస్టుతో తన టెస్టు కెరీర్ను ఆరంభించిన జయంత్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసి నాటౌట్ గా క్రీజ్లో నిలిచాడు. ఆ తరువాత మొహాలీలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జయంత్(55) హాఫ్ సెంచరీ నమోదు చేయగా,రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో ఒక సిరీస్లో రెండొందలకు పైగా పరుగులను జయంత్ యాదవ్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ ఎనిమిది వికెట్లను జయంత్ సాధించాడు. విరాట్ డబుల్, జయంత్ యాదవ్ శతకాలతో భారత్ ఆరు వందలకు పైగా స్కోరు సాధించింది. జయంత్(104) ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు.