
ముంబై: మైదానంలో పాదరసంలాంటి కదలికలతో క్రికెట్ ఫీల్డింగ్‌కు కొత్త పాఠాలు నేర్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ఇప్పుడు భారత జట్టుకు శిక్షకుడిగా పని చేయాలని భావిస్తున్నాడు. బీసీసీఐ ప్రకటనకు స్పందిస్తూ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం రోడ్స్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 27న 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్న రోడ్స్ తొమ్మిది సీజన్ల పాటు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే అనుభవంతో తాను భారత జట్టుతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు.
‘భారత్‌తో నాది ప్రత్యేక అనుబంధం. నాకు, నా భార్యకు ఈ దేశమంటే చాలా ఇష్టం. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు. గత కొన్నేళ్లలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా పెరిగిపోయాయి. అలాంటి టీమ్‌తో పని చేయాలని కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాను’ అని జాంటీ వెల్లడించాడు.