బుల్లెట్’ దిగింది | joru intractable athletes | Sakshi
Sakshi News home page

బుల్లెట్’ దిగింది

Published Fri, Feb 12 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

బుల్లెట్’ దిగింది

బుల్లెట్’ దిగింది

నారంగ్ బృందానికి స్వర్ణం
టెన్నిస్‌లో మరో రెండు కనకాలు
అథ్లెటిక్స్‌లో కొనసాగిన హవా


  గుహవాటి: దక్షిణాసియా క్రీడల్లో భారత షూటర్ల గురి అదిరింది. గురువారం అందుబాటులో ఉన్న ఐదు స్వర్ణాలను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటారు. టెన్నిస్, అథ్లెటిక్స్‌లోనూ టీమిండియా జోరు చూపెట్టడంతో పాయింట్ల పట్టికలో భారత్ దూసుకుపోతోంది. ఓవరాల్‌గా 237 (139 స్వర్ణాలు+ 78 రజతాలు+ 20 కాంస్యాలు) పతకాలతో టాప్‌లో కొనసాగుతోంది. శ్రీలంక (149), పాకిస్తాన్ (71) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాలిపరా షూటింగ్ రేంజ్‌లో జరిగిన పోటీల్లో హైదరాబాద్ స్టార్ షూటర్ గగన్ నారంగ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గినా... వ్యక్తిగత విభాగంలో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల వ్యక్తిగత రైఫిల్ ప్రోన్‌లో నారంగ్ 183.1 పాయింట్లతో రెండో స్థానం (రజతం)లో నిలవగా, చైన్ సింగ్ (భారత్) 184.1 పాయింట్లతో ‘పసిడి’ని సొంతం చేసుకున్నాడు. టీమ్ విభాగంలో నారంగ్, చైన్ సింగ్, సురేంద్ర సింగ్‌ల త్రయం 1871.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. పురుషుల వ్యక్తిగత 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో సమరేష్ జంగ్ 580 పాయింట్లతో స్వర్ణం, పెంబా తమంగ్ (579 పాయింట్లు), విజయ్ కుమార్ (577 పాయింట్లు) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో కుహిలి గంగూలీ (619.9 పాయింట్లు) పసిడి, లజ్జా గౌస్వామి (608.2 పాయింట్లు) రజతం, అనుజా జంగ్ (607.5 పాయింట్లు) కాంస్యం సాధించారు. టీమ్ ఈవెంట్‌లోనూ ఈ ముగ్గురు 1835.6 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నారు.


 జోరు తగ్గని అథ్లెట్లు
భారత అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మరో ఏడు స్వర్ణాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో సుమన్ దేవి (59.45 మీ.) స్వర్ణం, అన్ను రాణి (57.13 మీ.) రజతం గెలిచారు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో వెటరన్ రంజిత్ మహేశ్వరి (16.45 మీటర్లు)కి పసిడి, సురేందర్ (15.89 మీటర్లు)కు రజతం లభించాయి. పురుషుల షాట్‌పుట్‌లో ఓం ప్రకాశ్ సింగ్ (18.45 మీటర్లు), జస్‌దీప్ సింగ్ (17.56 మీటర్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజతం సొంతం చేసుకున్నారు. పురుషుల 15 వందల మీటర్లలో అజయ్ కుమార్ సరోజ్ (3:53.46 సెకన్లు) స్వర్ణం నెగ్గాడు. మహిళల విభాగంలో పీయూ చిత్ర (4:25.29 సెకన్లు) పసిడితో మెరిసింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరుణ్ అయ్యస్వామి (50.54 సెకన్లు), జితిన్ పాల్ (50.57 సెకన్లు); మహిళల్లో జునా మర్ము (57.69 సెకన్లు), అశ్విని అకుంజ్ (58.92 సెకన్లు) స్వర్ణాలు, రజతాలు సాధించారు. మహిళల 10 వేల మీటర్లలో సూర్య (32:39.86 సెకన్లు) కనకం కైవసం చేసుకుంది.. 4ఁ400 మీటర్ల రిలేలో పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలను సాధించాయి.
 
 రిషికకు రజతం

టెన్నిస్‌లో హైదరాబాద్ అమ్మాయి రిషిక సుంకరకు రజతం లభించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో రిషిక-నటాషా పల్హా 5-7, 6-2, 4-10తో ప్రా ర్థన తోంబ్రే-శర్మద బాలు చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడ్డారు. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో రామ్‌కుమార్ రామనాథన్ 7-5, 6-2తో సాకేత్ మైనేనిపై నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement