
చేజేతులా...
న్యూఢిల్లీ: అగ్రశ్రేణి జట్లతో ఆడే సమయంలో ఆధిక్యంలో ఉన్నా ఆఖరి క్షణం వరకు అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ఫలితం లభిస్తుంది. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో యువ భారత జట్టుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందాలంటే దక్షిణ కొరియాపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ 3-3 గోల్స్ వద్ద ‘డ్రా’ చేసుకుంది.
మరోవైపు క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే తమకు అవసరమైన ‘డ్రా’ ఫలితాన్ని పొంది దక్షిణ కొరియా ముందంజ వేసింది. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్ (32వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్... మన్‌దీప్ సింగ్ (45వ నిమిషంలో) ఒక గోల్ చేశారు. దక్షిణ కొరియా తరఫున సియుంగ్జు యు (16వ, 58వ, 60వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ నమోదు చేసి భారత ఆశలను ఆవిరి చేశాడు. లీగ్ దశ తర్వాత భారత్, కొరియా నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నా... మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా కొరియా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. లీగ్ దశలో కొరియా 12 గోల్స్ చేసి, 10 గోల్స్‌ను సమర్పించుకుంది. భారత్ 8 గోల్స్ సాధించి, మరో 8 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది.
ఒకదశలో 3-1 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత ఒక్కసారిగా మ్యాచ్‌పై పట్టు కోల్పోయారు. చురుకైన కదలికలకు పెట్టింది పేరైన కొరియా ఆటగాళ్లు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి భారత ఆటగాళ్లకు షాక్ ఇచ్చారు. కొరియా మెరుపుదాడుల నుంచి భారత ఆటగాళ్లు తేరుకునేలోపే చివరి పది నిమిషాలు గడిచిపోయాయి. మొత్తానికి సొంతగడ్డపై మెరుస్తారనుకున్న భారత యువ ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇక భారత జట్టు 9 నుంచి 12 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం; ఆస్ట్రేలియాతో జర్మనీ; మలేసియాతో కొరియా; న్యూజిలాండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. అదే రోజు జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది.