లక్నో: లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే జోరును నాకౌట్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాపై 4–0తో, ఇంగ్లండ్‌పై 5–3తో నెగ్గిన భారత్‌కు మూడో లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నుంచి గట్టిపోటీ ఎదురైంది. చివరకు 2–1తో గట్టెక్కిన భారత్ నాకౌట్ మ్యాచ్‌ను మాత్రం తేలిగ్గా తీసుకోవడంలేదు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ప్రణాళిక ప్రకారం ఆడతామని భారత కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. ‘దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి 15 నిమిషాల్లో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడలేదు. ప్రత్యర్థి జట్టు గురించి ఎక్కువ ఆలోచించకుండా సహజశైలిలో ఆడటం మంచి ఫలితాలు ఇస్తుందని నేను నమ్ముతాను’ అని హరేంద్ర చెప్పారు.