
జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత్‌కు కాంస్యం
అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు అద్భుతం సృష్టించారు. జూనియర్ మహిళల ప్రపంచకప్‌లో తొలిసారి కాంస్య పతకం సాధించారు. ‘షూటౌట్’దాకా పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది.
మొన్‌చెన్‌గ్లాడ్‌బాచ్ (జర్మనీ): తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న భారత హాకీ నుంచి ఆదివారం శుభవార్త వినిపించింది. జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఈ పోటీల చరిత్రలో తొలిసారి భారత్ కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. మ్యాచ్‌తో పాటు షూటౌట్‌లో రాణి కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది.
నిర్ణీత సమయానికి ఇరుజట్ల స్కోరు 1-1తో సమం కావడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. ఇందులో లభించిన ఐదు అవకాశాల్లో భారత్ తరఫున రాణి మాత్రమే లక్ష్యాన్ని సాధించింది. ఇంగ్లండ్ క్రీడాకారిణిల్లో ఎమిలి డెఫ్రోండ్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో మళ్లీ ఇరుజట్ల స్కోరు 1-1తో సమమైంది.
‘సడన్‌డెత్’లో తొలి ప్రయత్నంలో రాణి, డెఫ్రోండ్‌లు తమ జట్లకు గోల్స్ అందించారు. రెండో ప్రయత్నంలో పూనమ్ రాణి విఫలం కాగా, షోనా (ఇంగ్లండ్) కూడా అవకాశాన్ని వృథా చేసుకుంది. ఇక మూడో ప్రయత్నంలో 17 ఏళ్ల నవనీత్ కౌర్ గోల్ సాధించగా... అనా తోమా (ఇంగ్లండ్) నిరాశపర్చింది. దీంతో భారత్ 3-2తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు జరిగిన నిర్ణీత సమయంలో రాణి (13వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందించగా... అనా తోమా (55వ ని.) ఇంగ్లండ్ తరఫున గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఫైనల్లో నెదర్లాండ్స్ 4-2తో అర్జెంటీనాపై నెగ్గి స్వర్ణం సాధించింది.
ఒక్కొక్కరికి రూ.లక్ష
కాంస్య పతకం గెలిచిన భారత జూనియర్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. కోచ్ నీల్ హావ్‌గుడ్‌కు రూ.లక్ష, సహాయ సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు హెచ్‌ఐ కార్యదర్శి బాత్రా తెలిపారు.