
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ భారత్ క్రికెట్ జట్టు రెండుసార్లు మాత్రమే వన్డే వరల్డ్‌కప్‌ను సాధించింది. అందులో హరియాణా హరికేన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు తొలి వరల్డ్‌కప్‌ను అందుకుని యావత్ దేశ కలను సాకారం చేసింది. 1983లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన కపిల్ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు.. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను మట్టికరిపించి మెగాట్రోఫీని ముద్దాడింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 184 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించినా, దాన్ని కాపాడుకుని కప్ గెలవడం విశేషం. వెస్టిండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేసి భారత జట్టు మొదటిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఆ టోర్నీ ఆద్యంతం భారత్‌ను విజయ పథాన నడిపించిన కపిల్‌దేవ్ 61వ బర్త్ డే సందర్భంగా అతని గురించి మరొకసారి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం.
- హరియాణా తరఫున 17 ఏళ్లు క్రికెట్‌ను ఆడాడు. 1975 నుంచి 1992 వరకూ హరియాణా జట్టు సభ్యుడిగానే ఉన్నాడు
- 1975-76 అరంగేట్రపు ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన కపిల్ 121 వికెట్లు సాధించడం ద్వారా అతను భారత్ క్రికెట్ జట్టు సెలక్టర్లను ఆకర్షించాడు.
- ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు సాధించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
- 1983-84ల్లో ఇంగ్లిష్ కౌంటీ క్లబ్స్ వార్సెస్‌షైర్ తరఫున ఆడిన కపిల్.. 1981నుంచి 83వరకూ నార్తాంప్టాన్‌షైర్ తరఫున ఆడాడు.
- 1978 పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
- తన కెరీర్‌లో 184 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన కపిల్ దేవ్ ఏనాడూ రనౌట్ కాలేదు. ఇది ఏ ఒక్క క్రికెటర్‌కి ఇప్పటివరకూ సాధ్యం కాలేదు.
- 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో విండీస్ దిగ్గజ ఆటగాడు రిచర్డ్స్ మిడ్ వికెట్‌పై షాట్ కొట్టగా కపిల్ వెనక్కి పరుగెడుతూ వెళ్లి దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. అది భారత్ వరల్డ్‌కప్ గెలవడానికి టర్నింగ్ పాయింట్.
- టెస్టుల్లో ఐదు వేల పరుగులు, 400కి పైగా వికెట్లు సాధించిన ఏకైక ఆటగాడు కపిల్‌దేవ్
- 2002లో విజ్డెన్ కపిల్‌ను భారత శతాబ్దపు క్రికెటర్‌గా ఎంపిక చేసింది.
- 2002లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్‌కు చోటు దక్కింది.
- 1979-80 సీజన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా వంద వికెట్ల మార్కును, వెయ్యి పరుగుల మార్కును చేరాడు. దాంతో ఈ ఫీట్ సాధించిన పిన్నవయస్కుడిగా కపిల్‌దేవ్ గుర్తింపు సాధించాడు.
- కపిల్‌దేవ్ 434 వికెట్లు సాధించడం ద్వారా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. అప‍్పటివరకూ న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(431) పేరిట ఉన్న రికార్డును కపిల్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో కపిల్ రికార్డును విండీస్ పేసర్ కర్ట్నీ వాల్ష్ బద్ధలు కొట్టాడు.
- 1983 వరల్డ్‌కప్‌లో 303 పరుగులు, 12 వికెట్లతో పాటు 7 క్యాచ్‌లను అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కపిల్ దేవ్ 175 పరుగులు సాధించి జట్టును గెలిపించి సెమీస్‌కు చేర్చాడు.